ఏపీలో కాంగ్రెస్ కొత్త స్కెచ్ - రేవంత్ కు బాధ్యతలు, అమరావతికి ప్రియాంక..!!
ఏపీలో ఎన్నికల లెక్కలు మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇదే సమయంలో ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. వైసీపీ, టీడీపీ ఏపీలో బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీ కార్యాచరణ ప్రకటించారు, తెలంగాణ సీఎం రేవంత్ ఏపీలో ప్రచారం చేస్తారని వెల్లడించారు.
ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ కార్యాచరణ ఖరారు చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నినాదాలు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ఇప్పుడు హోదా ఇవ్వకుండా ఎన్డీఏలో ఎలా తిరిగి చేరుతున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏపీకి విభజన హామీల అమలు కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేసారు. ఏపీలో బీజేపీ ఉనికి లేకపోయినా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీకి పూర్తిగా సహకరిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఏపీలో ఎన్నికల సంసిద్దతతలో భాగంగా నాలుగు సభలు నిర్వహిస్తామని ప్రకటించారు.

ఏపీ రాజధాని అమరావతి కోసం ప్రియాంక త్వరలో భారీ బహిరంగ సభలో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ కార్మికుల అందోళనకు మద్దతుగా విశాఖలోనూ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఏపీలో ఎన్నికల ప్రచార సభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాల్గొంటారని మాణిక్కం ఠాగూర్ ప్రకటించారు. రేవంత్ కు ఏపీలో ఎన్నికల ప్రచారం పైన ఫోకస్ చేయాలని పార్టీ సూచించింది. దీంతో, తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ ఏపీలో ప్రచారం చేస్తే సీఎం జగన్..టీడీపీ అధినేత చంద్రబాబు పైన ఏ విధంగా స్పందిస్తారు..రాజకీయంగా వారిద్దరినీ ఎలా ఫిక్స్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications