విభజన: సొంత నేతల బేఖాతరు, కాంగ్రెస్‌కు జగన్ ధీమా
హైదరాబాద్: రాష్ట్ర విభజన తీరుపై కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి నాయకులు పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దత్తపుత్రుడిని చూసుకుని తమవంటి పార్టీ నాయకులను కూడా అధిష్టానం పక్కన పెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ను కాంగ్రెసు అధిష్టానం దత్తపుత్రుడిగా ఆయన అభివర్ణిస్తున్నారు.
విభజన అనివార్యమైనప్పుడు కనీసం ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా చిన్నపాటి సర్దుబాట్లు కూడా చేయడానికి కాంగ్రెసు అధిష్టానం ముందుకు రాకపోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఉంది. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని చిరంజీవి వంటి కేంద్ర మంత్రులు పట్టుబడుతూ వస్తున్నారు. ఆ మాటను అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. రాష్ట్ర విభజనలో సీమాంధ్రకు చేకూర్చే ప్రయోజనాలేమిటో, ఇచ్చే ప్యాకేజీలు ఏమిటో కూడా స్పష్టంగా లేదని సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తాము ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోందని, దానివల్ల సీమాంధ్రలో కాంగ్రెసు గెలిచే అవకాశాలు శూన్యమవుతాయని, ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెసు అధిష్టానం పట్టించుకోవడం లేదని వారంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో పొత్తు పెట్టుకునే ఉద్దేశ్యంతోనే, జగన్‌పై నమ్మకంతోనే కాంగ్రెసు అధిష్టానం ముందుకు సాగుతోందని వారు విమర్శిస్తున్నారు.
ఎన్నికల తర్వాత తాము యుపిఎకు మద్దతిస్తామని వైయస్ జగన్ ప్రకటించారని, దాంతో జగన్ మద్దతు తీసుకోవడానికి వీలుగానే అధిష్టానం కదులుతోందని అంటున్నారు. సమైక్యాంధ్ర నినాదంతో ముందుకు సాగుతున్న వైయస్ జగన్‌కు సీమాంధ్రలో మేలు జరిగే విధంగా కాంగ్రెసు అధిష్టానం వ్యవహరిస్తోందనే విమర్శ కూడా ఉంది.












Click it and Unblock the Notifications