కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు కన్నుమూత
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు(75) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

పాలడుగు మృతికి కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. పాలడుగు స్వస్థలం కృష్ణా జిల్లా ముసనూరు మండలం గోగులంపాడు గ్రామం. 1968లో యువజన కాంగ్రెస్‌లో చేరిన పాలడుగు 1972లో తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
నూజివీడు శాసనసభ స్థానం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి, నేదురుమల్లి కేబినెట్‌లో పాలడుగు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. పాలడుగు వెంకట్రావు ప్రస్తుతం ఎమ్మెల్సీ కొనసాగుతున్నారు.
కాగా, వెంకట్రావు మృతికి తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. పాలడుగు కుటుంబ సభ్యులకు తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్, సీనియర్ నేత జానారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పాలడుగు పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications