''పెద్దాయన్ను'' సున్నితంగానే తిరస్కరించిన చంద్రబాబు?? రాజకీయం అంటే అదే!!
కడప జిల్లాలో సీనియర్ నేత. ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీలో ఆయన మాట కూడా ఒక వేదవాక్కులా భావించేవాళ్లు. రాజకీయం చేయడంలో దిట్ట. కానీ కాలం కలిసిరాలేదు. అంతటి రాజకీయ నేత కూడా కొన్నాళ్లు కనుమరుగు కావాల్సి వచ్చింది. మళ్లీ వెలుగులోకి రావాలనుకుంటున్న సమయంలో ఎటు పయనించాలో అర్థంకాని అయోమయ స్థితి. అందుకు తగ్గట్లుగా ఉన్న ఏపీ రాజకీయ యవనిక. ఆయనే.. డాక్టర్ దుగ్గిరెడ్డి లక్ష్మీరెడ్డి రవీంద్రారెడ్డి. డీఎల్ రవీంద్రారెడ్డి అనే ఎక్కువగా పిలుస్తారు.
Recommended Video

డీఎల్ కు మైదుకూరు పెట్టనికోట
కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం ఆయనకు పెట్టనికోట. 1978 నుంచి 2009 వరకు వరుసగా జరిగిన ఎన్నికల్లో ఆయన ఆరుసార్లు విజయం సాధించారు. రెండుసార్లు మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన శెట్టిపల్లి రఘురామిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఆదరణ లేకపోవడంతో ఆయన కూడా అజ్ఞాత వాసం పాటించారు.
2014, 2019 రెండు ఎన్నికల్లో మైదుకూరు నుంచి వైసీపీ తరఫున పోటీచేసిన శెట్టిపల్లి రఘురామిరెడ్డి విజయం సాధించారు. ఇక్కడ ఎవరు విజయం సాధించాలన్నా డీఎల్ మద్దతు ఉండాల్సిందే. అంతగా ఈ నియోజకవర్గంతో ఆయన అనుబంధం పెనవేసుకుపోయింది.

రాజకీయంగా ఉనికిని చాటుకోవాలని..
రాజకీయంగా తన ఉనికిని చాటుకోవాలనే యోచనతో ఉన్న డీఎల్ తెలుగుదేశం పార్టీలోకి రావడానికే ఎక్కువగా మొగ్గుచూపారు. అయితే ఇక్కడ ఆ పార్టీకి బలమైన అభ్యర్థిగా పుట్టా సుధాకర్‌యాదవ్ ఉన్నారు. వరుసగా రెండు ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఆయనవైపే చంద్రబాబు మొగ్గుచూపుతున్నారు.
2019 ఎన్నికలకు ముందు డీఎల్ వైసీపీకి మద్దతు పలికారు. అయినప్పటికీ అధిష్టానం దగ్గర సరైన గుర్తింపు దక్కలేదు. కడప జిల్లాలో సీనియర్ రాజకీయవేత్తగా ఉన్న తనను కాదని బద్వేల్‌కు చెందిన గోవింద్‌రెడ్డికి, పక్క నియోజకవర్గమైన ప్రొద్దుటూరుకు చెందిన రమేష్ యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవులు దక్కడంతో కినుక వహించారు.

ఏంచేయాలో అర్థంకాని పరిస్థితి
కొంతకాలం ఓపిక పట్టినప్పటికీ వైసీపీలో తనకు భవిష్యత్తు లేదని ఆయన అర్థమైంది. వివేకా హత్య కేసులో నిందితులెవరో జగన్‌కు తెలుసని, రానున్న ఎన్నికల్లో ఆయన ఓటమిపాలవుతారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి రాయబారం నడిపినప్పటికీ ఇక్కడ బలమైన బీసీ అభ్యర్థిగా పుట్టా ఉండటంతో చంద్రబాబు డోలాయమానంలో పడ్డారు.
బీజేపీ తీర్థం పుచ్చుకుంటే జనసేన మద్దతుతో గెలవగలిగే అవకాశం ఉంటుందనే అంచనా వేసుకున్నప్పటికీ ఎందుకనో ఆ విషయంలో కూడా డీఎల్ వెనక్కి తగ్గారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకొని పోటీచేస్తాయంటూ వార్తలు వస్తుండటంతో ఎటువైపు అడుగువేయాలో అర్థంకాని అయోమయ స్థితిలో అంతటి సీనియర్ రాజకీయవేత్త సైతం ఉండిపోయారు. ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది కాలమే నిర్ణయించనుంది.!!












Click it and Unblock the Notifications