చంద్రబాబునాయుణ్ని కొట్టండి.. ధైర్యం ఉంటే నరకండి: వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
''రాష్ట్రంలో అన్ని సమస్యలకు మూలం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. ఆయన కనిపిస్తే కొట్టండి.. మీకు ఇంకా ధైర్యం ఉంటే నరికేయండి.. ఆయనవల్లే ఈ రాష్ట్రం నాశనమైంది.. గిరిజనుల జీవితాలు నాశనమయ్యాయంటూ'' వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి.
గడప గడపకు ప్రభుత్వం పేరుతో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఫల్గుణకు గిరిజన మహిళల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. సమస్యలపై ఆయన్ను నిలదీయడంతో సహనం కోల్పోయి మాట్లాడారు. చంద్రబాబునాయుడువల్లే ఏ పనీ ముందుకు సాగడంలేదంటూ మండిపడ్డారు. సమస్యలను చెప్పండి.. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దని వ్యాఖ్యానించేవారి వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఒక దశలో ఎమ్మెల్యేపై చేయిచేసుకుంటారేమోనని భావించారు. ఇల్లు లేదంటూ ఓ మహిళ ప్రశ్నించగా.. ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు కోర్టులో కేసు వేశారని, దీనివల్లే అవి నిలిచిపోయాయని, ఆయన్నే అడగాలని, తిరగబడాలంటూ పిలుపునిచ్చారు. మీకు ధైర్యం ఉంటే నరకండంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి తనకు చేదు అనుభవం ఎదురవడంతో ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కామయ్యపేట పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని, రోడ్లు లేవని, మంచినీరు రాదని, మౌలిక సౌకర్యాలు లేక ఇక్కట్లకు గురవుతున్నామంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను ప్రజలు నిలదీయడంతో అధికారులు సర్దిచెప్పారు. రహదారులు మంజూరైనప్పటికీ నిధులు లేక నిలిచిపోయాయని, అయినా గిరిజనులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాంకదా అంటూ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యేకు వత్తాసు పలకడంతో వారిపై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications