హైదరాబాదులో జగన్ సమైక్య సభకు పోలీసులు నో
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావానికి హైదరాబాదు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నెల 19న ఎల్బీ స్టేడియంలో జగన్ పార్టీ సమైక్య శంఖారావం నిర్వహించాలని భావించింది.
అయితే శాంతిభద్రతలకు భంగం వాటిల్లే అవకాశాలు ఉన్నందున అనుమతి ఇవ్వలేదని డిసిపి కమలాకర్ రెడ్డి శనివారం తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎపిఎన్జీవోల సమ్మ నేపథ్యంలో ఈ సభను నిర్వహిస్తే ఉద్రిక్తత నెలకొని, గొడవలు జరిగే అవకాశఁ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఎట్టి పరిస్థితుల్లోను సభ నిర్వహించేందుకు వీలులేదని తాము లిఖిత పూర్వకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లేఖ రాసినట్లు తెలిపారు.
మాకెందుకివ్వరు?: మైసూరా
హైదరాబాదులో కొన్ని రాజకీయ శక్తులకు ఇలాంటి సభలు నిర్వహించడం ఇష్టం లేకపోతే ఇతర ప్రజల హక్కులను ఎలా కాలరాస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మైసూరా రెడ్డి ప్రశ్నించారు. అందరికిచ్చి తమకు సభ నిర్వహణకు ఎందుకు అనుమతివ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి నిరాకరణ ఉత్తర్వులు పోలీసుల ఆర్డరా లేక పొలిటికల్ ఆర్డరా చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications