సిమి టెర్రరిస్ట్స్ ఎన్‌కౌంటర్: రంగంలోకి ఎన్ఐఏ, 3రాష్ట్రాలకు హెచ్చరిక
హైదరాబాద్: నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన అస్లాం, జకీర్‌లు సిమి ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. గతంలో మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుండి ఐదుగురు సిమి ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఆ ఐదుగురిలో వీరిద్దరు కూడా ఉన్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మిగిలిన ముగ్గురు ఏమయ్యారనే విషయమై పోలీసులు, జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) ఆరా తీస్తోంది. వీరు ముగ్గురు కూడా దక్షిణాది రాష్ట్రాలలోనే ఉండి ఉంటారని పోలీసులు, ఎన్ఐఏ అనుమానిస్తోంది. దీంతో, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఎన్ఐఏ అప్రమత్తం చేసింది.

గతంలో సిమికి చెందిన కార్యకర్తలు దోపిడీలకు పాల్పడిన ఘటనలను ఎన్ఏఐ పరిశీలిస్తోంది. వాటిని పోల్చి చూస్తోంది. నల్లగొండ జిల్లాలో ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరి వివరాలు తెలుసుకున్నారు. ఖాండ్వా జైలు నుండి తప్పించుకున్న ఐదుగురి సిమి టెర్రరిస్టుల పైన గతంలోనే ఎన్ఐఏ భారీ రివార్డ్ ప్రకటించింది. ఎన్ఐఏ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన జకీర్, అస్లాం ఫోటోలను తెప్పించింది.
కాగా, నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో అస్లాం, జకీర్ అనే ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిద్దరిపై మహారాష్ట్రలో కూడా పలు కేసులు ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సిమీకి చెందిన ఉగ్రవాది అబూ ఫైజల్ ముఠాలో వీరిద్దరు కీలక సభ్యులని అంటున్నారు.
గతంలో మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుంచి వీరిద్దరు పరారైనట్లు చెబుతున్నారు. వారిని ఉగ్రవాదులుగా ఇంకా గుర్తించలేదని సంఘటనా స్థలాన్ని సందర్శించిన తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ చెప్పారు. విచారణ కొనసాగుతోందని అన్నారు.
వారిద్దరు కూడా ముంబై యాంటీ టెర్రరిస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. 2007లో కేరళలో ఉగ్రవాద సాయుధ నిర్వహించిన ముఠాలో ఉన్నారని చెబుతున్నారు. ఖాండ్వా పోలీసు స్టేషన్‌లో 2009, 2010ల్లో కేసులు నమోదైనట్లు సమాచారం.
2010లో భోపాల్‌లోని ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో చోరీకి పాల్పడినట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు బాంబు పేలుళ్ల సంఘటనల్లో వారి పాత్ర ఉన్నట్లు చెబుతున్నారు. 2013లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీలో బాంబులు పేల్చింది కూడా వీరేనని సమాచారం. 2014 అక్టోబర్‌లో కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్‌బిఐలో చోరీకి పాల్పడింది కూడా ఈ ముఠా సభ్యులేనని అనుమానిస్తున్నారు.
కాగా, వారిద్దరికి ఏపీలోనూ, చెన్నైలోని బాంబు పేలుళ్ళ కేసులోనూ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెందిన ఉగ్రవాదులు 3 నెలలపాటు తడ ఏరియాలో సంచరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
నెల్లూరు జిల్లా శ్రీహరికోట సమీపలోని షార్ కేంద్రం వద్ద వీరు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు వీరి కోసం తమిళనాడు పోలీసులు కూడా తడలో గాలించారని తెలుస్తోంది.
తమిళనాడులో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని అనుమానించిన పోలీసులు ఉగ్రవాదుల ఫొటోలతో తడలోనూ, చుట్టుపక్కల గ్రామాల్లోనూ తిరిగారని స్థానిక పోలీసులు చెబుతున్నారు. వారిద్దరు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని నల్లగొండ జిల్లా భువనగిరి డిఎస్పీ తెలిపారు. దుండగులు షార్ప్ షూటర్లని, గతంలో వారికి నేరచరిత్ర ఉందన్నారు. మరోవైపు, నల్గొండ జిల్లా అర్వపల్లి మండలంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications