ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా.. ఈసీ సంచలన ప్రకటన.. వైసీపీ సర్కారుకు షాక్..
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించిన దరిమిలా... పంచాయితీ రాజ్ చట్టంలోని విశేష అధికారాలను ఉపయోగించి ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదివారం ప్రకటించారు. అయితే, ఇప్పటిదాకా జరిగిన పక్రియ ఏది కూడా రద్దు కాబోదని, నామినేషన్లు, ఏకగ్రీవాలను గుర్తిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అందుకే వాయిదా..
కొవిడ్ 19(కరోనా వైరస్) భయానక రీతిలో వ్యాప్తి చెందితున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే షట్ డౌన్ ప్రకటించాయి. శనివారం నుంచి పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలోనూ స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు, పబ్లిక్ గ్యాదరింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. మరోవైపు కరోనాను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించింది. జనం గుంపులుగా కూడొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఏపీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరే పరిస్థితి నెలకొంటుంది. అలాంటప్పుడు కేంద్రం ఆదేశాలను ధిక్కరించినట్లవుతుంది. దీనిపై అత్యున్నత స్థాయి చర్చలు, సంప్రదింపులు జరిపిన తర్వాత ఎన్నికలు ఆరు వారాలపాటు వాయిదా వేయాలని డిసైడైనట్లు కమిషనర్ రమేశ్ కుమార్ వివరించారు.
అసాధారణ స్థితి..
కరోనా ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా అసాధారణ స్థితి నెలకొందని, సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తడంతో కేంద్ర సర్కారుతోపాటు రాష్ట్ర యంత్రాంగంతోనూ సుదీర్ఘ మంతనాలు జరిపామని, ప్రజారోగ్యం కోణంలో మాత్రమే ఎన్నికల వాయిదా వేస్తున్నాం తప్ప.. ఇందులో ఎలాంటి రాజకీయ కోణానికి, పక్షపాతానికి తావులేదని ఈసీ రమేశ్ అన్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని ప్రతిపక్ష టీడీపీ కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయనీ వివరణ ఇచ్చారు.

నామినేషన్లు, ఏకగ్రీవాలు యదాతధం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఎంపీటీసీ, జెడ్పీటీడీసీలకు ఈనెల 21న, మున్సిపాలిటీలకు ఈనెల 23న ఎన్నికలు జరగాల్సిఉంది. కాగా, ఎన్నికల వాయిదా వల్ల కేవలం పోలింగ్ తేదీ మాత్రమే ప్రభావితం అవుతుందితప్ప.. నామినేషన్లు, ఏకగ్రీవాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఈసీ స్పష్టం చేసింది. నామినేషన్లు, ఏకగ్రీవాలను గుర్తిస్తూ.. మరోసారి సవరించిన షెడ్యూల్ ను ప్రకటిస్తామని కమిషనర్ తెలిపారు. రెండు విడతల్లో జరగాల్సిన పంచాయితీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ఇంకా మొదలు కాలేదు కాబట్టి.. తేదీల్లో మార్పులతో కొత్త నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అయితే..

మళ్లీ ఎప్పుడు?
కరోనా కలకలం నేపథ్యంలో ఏపీ స్థానిక ఎన్నికలన్ని ఆరు వారాల పాటు వాయిదా వేసిన ఎన్నికల సంఘం.. మళ్లీ ప్రక్రియను పున:ప్రారంభిస్తామని చెప్పటినప్పటికీ.. ఆ లోపు వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టకుంటే ఎన్నికలు మరోసారి వాయిదాపడే అవకాశమూ లేకపోలేదు. కరోనా ప్రభావానానికి సంబంధించి కేంద్రం ఎప్పటికప్పుడు జారీ చేస్తోన్న ఆదేశాలకు అనుగుణంగా, రాష్ట్రంలో పరిస్థితులను బేరీజు వేసుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకుంటామని ఈసీ రమేశ్ కుమార్ తెలిపారు.

వైసీపీ సర్కారుకు షాక్..
స్థానిక ఎన్నికల వాయిదా ప్రకటన చేస్తూ వైసీపీ సర్కారును ఉద్దేశించి ఈసీ రమేశ్ కుమార్ పలు షాకింగ్ కామెంట్లు చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న విషయం ఈసీ దృష్టికి వచ్చిందని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ఎలాంటి చర్యలను కూడా ఈసీ ఆమోదించదని, సాక్ష్యాధారాలను బట్టి ఆయా ఘటనలకు బాధ్యులైనవాళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు వాయిదా పడిన ఈ ఆరువారాల పాటు.. అభ్యర్థుల భద్రత ప్రభుత్వానిదేనని, అభ్యర్థులకు ఎలాంటి హాని జరగకుండా పోలీసులు, అధికారులు కాపాడాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications