ఏపీ స్కూల్స్ లో కరోనా తిష్ట ; కేసులు అధికంగా ఉన్న జిల్లాలోనే; నవోదయ స్కూల్ లో 21 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. స్కూల్స్ ను మాత్రం కరోనా వదలటం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట స్కూల్స్ లో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో నవోదయ స్కూల్ లో కరోనా కలకలం రేగింది. ప్రతి రోజూ స్కూల్స్ కు చిన్నారులను పంపిస్తున్నా సరే కరోనా మహమ్మారి దెబ్బకు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.ఆగస్టు 16వ తేదీన ఏపీ ప్రభుత్వం పాఠశాలలను పునః ప్రారంభించడంతో విద్యార్థులు స్కూల్స్ బాట పట్టారు. కరోనా పూర్తిగా తగ్గకపోవటంతో స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పంజా
దేశంలో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ఫైవ్ లోనే ఉండటం గమనార్హం . ఏపీలో కరోనా కేసుల నేపధ్యంలో కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వం స్కూల్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక స్కూల్స్ లోనూ నిబంధనలు పాటిస్తున్నా సరే కేసులు నమోదు అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. అటు కరోనా కేసుల నమోదులతో స్కూల్స్ యాజమాన్యాలు తలపట్టుకుంటున్నాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో చిన్నారులే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తుంది.

పెద్దాపురం జవహర్ నవోదయా స్కూల్ లో కరోనా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం అనేక జిల్లాలలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ పాఠశాలలలో నిత్యం కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇక తాజాగా తూర్పు గోదావరి జిల్లా జవహర్ నవోదయ స్కూలో కరోనా కలకలం రేగింది.తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం లోని జవహర్ నవోదయ విద్యాలయం లో 21 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలుస్తుంది.

21 మందికి కరోనా పాజిటివ్ ... విద్యార్థులందరికీ కోవిడ్ టెస్టులు
పాఠశాలలో చదువుతున్న 80 మంది విద్యార్థులు నమూనాలను సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపించగా ఇప్పటి వరకు 21 మంది కరోన బారిన పడ్డట్టు సమాచారం . మిగతా వారికి సంబంధించి కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇరవైఒక్క మందిని వేరుగా ఉంచి జవహర్ నవోదయ విద్యాలయా ఆవరణను శానిటైజ్ చేయించినట్లు తెలుస్తోంది. జవహర్ నవోదయ విద్యాలయాలో 21 మంది కరోనా బారిన పడడంతో, మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన వ్యక్తమవుతోంది.
Recommended Video

పండుగల సీజన్ .. కరోనా కేసులు పెరిగే ఛాన్స్ .. అలెర్ట్ అంటున్న హైకోర్టు
ప్రస్తుతం ఏపీలో ఎక్కువ కేసులు విద్యార్ధులవే కావటం గమనార్హం. తాజాగా స్కూల్స్ లో థర్డ్ వేవ్ వచ్చిందా అన్న భయం తల్లిదండ్రులను వెంటాడుతుంది. ఒక పక్క ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టి ఊరటనిస్తున్నా విద్యార్థులకు నిత్యం కరోనా సోకుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల కరోనాను అసలు లైట్ తీసుకోవద్దని ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ కు కీలక సూచనలు చేసింది. పండుగ సమయాల్లో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని ప్రభుత్వానికి సూచించింది. ఉదాసీనత వద్దని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల విషయంలో ప్రభుత్వ అలసత్వంపై ఏపీ హైకోర్టులో అనేక పిటీషన్లు దాఖలైన నేపధ్యంలో జరుగుతున్న విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.












Click it and Unblock the Notifications