విజయవాడ జీజీహెచ్ లో కరోనా కల్లోలం: వైద్యులను వదలని మహమ్మారి; ఆందోళనలో వైద్యులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాకేసులు విపరీతంగా పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే పెరుగుతున్న కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇటీవల ఏపీలో కడప రిమ్స్ లో వైద్య విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ కాగా, స్విమ్స్ లో ఇప్పటికి 200 మంది కి పైగా కరోనా బారిన పడగా రుయా ఆస్పత్రిలో 120 మందికి కరోనా సోకినట్లు తెలుస్తుంది. ఇక విజయవాడ జీజీహెచ్ లోనూ కరోనా కల్లోలం సృష్టిస్తుంది.

విజయవాడ జీజీహెచ్ లో 100 మంది వైద్యులకు, సిబ్బందికి కరోనా
విజయవాడ జిజిహెచ్ లో 100 మంది కరోనా పాజిటివ్ బారిన పడ్డారు.ఇటీవల 50 మంది మొదట కరోనా బారిన పడ్డారు. వారిలో 20 మంది జూనియర్ వైద్యులు ఉన్నారు. మిగతా వారంతా వైద్య సిబ్బంది . ఆసుపత్రి సూపరింటెండెంట్ తో సహా జూనియర్ వైద్యులు కరోనా బారిన పడగా ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పటివరకు మొత్తంగా 100 మంది కరోనా పాజిటివ్ బారిన పడ్డారు.. కరోనా బారిన పడిన వారంతా ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. విజయవాడ జీజీహెచ్ లో వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరిన బాధితులు సరైన వైద్యం అందక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్పత్రులలో వైద్య సిబ్బంది కొరత.. ఇబ్బంది పడుతున్న బాధితులు
విజయవాడ జీజీహెచ్ లోని పాత కొత్త రెండు ఆసుపత్రులలో కలిపి వంద మంది వరకూ వైద్యులు వైద్య సిబ్బంది కరోనా పాజిటివ్ బారిన పడ్డట్టు గా సమాచారం. వంద మంది వరకు సిబ్బంది కరోనా బారిన పడడంతో ఆసుపత్రిలో బాధితులు వైద్య సిబ్బంది కొరత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇతర జిల్లాల నుంచి వైద్యులను పిలిపించి అయినా తమకు వైద్య సేవలను అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
విజయవాడ జిజిహెచ్ కు సంబంధించిన పాత కొత్త రెండు ఆసుపత్రులలో దాదాపు నలభై విభాగాలలో వైద్య సేవలు అందిస్తున్నారు.

వైద్యుల కొరత కారణంగా ఉన్న సిబ్బందికే పనిభారం
దాదాపు 800 మంది వరకు వైద్య సిబ్బంది ఈ ఆసుపత్రి లో పనిచేస్తున్నారు. అయితే తాజాగా వీరిలో చాలా మందికి కూడా కరోనా సోకడంతో వైద్య సేవలకు ఇబ్బంది తలెత్తింది. ప్రతి డిపార్ట్మెంట్ లోనూ వైద్యుల కొరత విజయవాడ జీజీహెచ్ ను వేధిస్తోంది. ఆసుపత్రిలో వైద్య సేవలకు ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ, వైద్యుల కొరత కారణంగా ఉన్న సిబ్బంది కే పనిభారం పెరుగుతుంది. కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే ముందు ముందు వైద్య సేవల పై భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏపీలో ఉప్పెనలా కరోనా కేసులు, పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య శుక్రవారం నాడు 13,212గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 64136 కరోనా యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాడు కరోనా మహమ్మారి బారినుండి 2942 మంది కోలుకోగా, తాజాగా ఐదుగురు కరోనా కారణంగా మృతి చెందారు. విపరీతంగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కఠిన ఆంక్షల నిర్ణయం తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
Recommended Video

కరోనా కేసుల పెరుగుదల .. ఏపీలో ఒమిక్రాన్ ఎఫెక్ట్
సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ కారణంగా రాష్ట్రంలో కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పదేపదే హెచ్చరికలు జారీ చేసినా ప్రజల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ కంటే ఈ వేవ్ లో వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న నేపధ్యంలో ప్రజల్లో కరోనా విషయంలో ఒకింత నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఫలితంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఒమిక్రాన్ వల్లే కరోనా కేసులలో ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications