వైజాగ్ మాజీకార్పోరేటర్ సత్యవతి హత్య: ఎన్టీఆర్‌తో ఆమెకు మంచి సంబంధాలు
డబ్బు,నగల కోసం సత్యవతి ఇంట్లో ఉంటున్న రామలక్ష్మే ఈ ఘాతుకానికి పాల్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
విశాఖపట్నం: నమ్మి చేరదీస్తే ఆశ్రయం ఇచ్చిన వ్యక్తినే కిరాతకంగా చంపేసిన ఘటన విశాఖపట్టణంలో వెలుగుచూసింది. ఘటనలో అల్లిపురం మాజీ కార్పోరేటర్ సత్యవతి హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. సత్యవతి హత్య నేపథ్యంలో ఆమె వద్ద ఆశ్రయం పొందిన రామలక్ష్మి అనే మహిళ మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దివంగత ఎన్టీఆర్ సమయంలో కార్పోరేటర్ గా పనిచేసిన సత్యవతి ఆ తర్వాత ప్రస్తుత సీఎం చంద్రబాబుతోను సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని స్థానికులు అంటున్నారు. కేవలం నగలు, డబ్బు దోచుకోవడం కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే..
ఎన్టీఆర్ హయాంలో కార్పోరేటర్ గా:
విశాఖలోని 30వ వార్డు అల్లిపురం మార్కెట్ యార్డు ఎదుట సత్యవతి నివసిస్తోంది.పెళ్లైన కొద్దిరోజులకే ఆమె భర్త చనిపోవడంతో అన్నయ్యలు, వారి పిల్లలే సర్వస్వంగా సత్యవతి జీవిస్తోంది. ఎన్టీఆర్ హయాంలో కార్పోరేటర్ గా పనిచేసిన సత్యవతి.. మార్కెట్ యార్డు అభివృద్ది కోసం కృషి చేసింది. చాలాకాలంగా ఆమె ఒంటరిగానే నివసిస్తున్నారు.

మార్కెట్ వ్యాపారులకు చేదోడుగా:
కార్పోరేటర్ గా పనిచేసిన నాటి నుంచి స్థానిక మార్కెట్లో కూరగాయలు, ఇతరత్రా సరుకులు అమ్ముకునేవారితో సత్యవతికి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. మార్కెట్ వ్యాపారులకు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. వ్యాపారులు సైతం చాలా సందర్బాల్లో తమ సామాగ్రిని, సరుకులను సత్యవతి ఇంట్లో భద్రపరుచుకునేవారు.
రామలక్ష్మిని చేరదీసిన సత్యవతి:
పలాస నుంచి తెల్లవారుజామునే వచ్చే పప్పులను కొనుగోలు చేసి పప్పులమ్మ(రామలక్ష్మి) నగరంలో పలుచోట్ల అమ్ముకునేది. ఈ క్రమంలో సత్యవతితో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో ఆమె బాగోగులు చూసుకోవడానికి రామలక్ష్మిని సత్యవతి తన ఇంట్లోనే పెట్టుకుంది.

మంగళవారం హత్యకు గురై:
కార్పోరేటర్ కు సమీప బందువైన రాజ్యలక్ష్మి అనే మహిళ సోమవారం సాయంత్రం చీపుర్లను ఆమె ఇంట్లో పెట్టి వెళ్లింది. మంగళవారం నాడు ఉదయం 10గం.కు సత్యవతి ఇంటికి వచ్చి చూడగా సత్యవతి విగతజీవిగా కనిపించింది. దీంతో ఆమె పెద్దగా అరవడంతో స్థానికులు వచ్చి గుమిగూడారు. అనంతరం సత్యవతి వార్త విశాఖ అంతటా వ్యాపించింది.
రామలక్ష్మి పైనే ఆరోపణలు:
డబ్బు,నగల కోసం సత్యవతి ఇంట్లో ఉంటున్న రామలక్ష్మే ఈ ఘాతుకానికి పాల్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. హత్య తర్వాత రామలక్ష్మి కనిపించకపోవడం, సత్యవతి చేతికి ఉండాల్సిన బంగారు గాజులు, మెడలోని బంగారు చైన్ కనిపించకపోవడంతో.. రామలక్ష్మి వాటితో ఉడాయించినట్టుగా ఆరోపిస్తున్నారు.

సోమవారం రాత్రి ఇలా జరిగింది:
సోమవారం రాత్రి రామలక్ష్మి ఇంటికి చేరుకోవడంలో ఆలస్యం కావడంతో లావణ్య అనే సమీప యువతిని తనకు తోడుగా సత్యవతి తీసుకొచ్చుకుంది. ఇంతలోనే ఇంటికి వచ్చిన రామలక్ష్మి లావణ్యను వద్దని వారించింది. తెల్లారేసరికి సత్యవతి హత్యకు గురై కనిపించింది.

మార్కెట్ దుకాణాలు బంద్:
సత్యవతి హత్య విషయం తెలిసిన వెంటనే అల్లిపురం మార్కెట్ వ్యాపారులు దుకాణాలు బంద్ చేశారు. తమకు అండగా ఉండే సత్యవతి ఇక లేరని తెలిసి కంటతడి పెట్టుకున్నారు. సత్యవతి మరణం అల్లిపురం వాసులను తీవ్ర శోకంలో ముంచెత్తింది. దివంగత ఎన్టీఆర్ కు రాఖీ కట్టేంత చనువు సత్యవతికి ఉండేదని అల్లిపురం వాసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications