అఖిలప్రియ తీరుపై తీవ్ర అభ్యంతరాలు: రసాభాసగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
అఖిలప్రియ తీరుతో అసంతృప్తికి లోనైన సులోచన తనకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆమెను నిలదీశారు.
నంద్యాల: ఏపీలో ఈమధ్య మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు రసాభాసగా మారుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. తాజాగా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కూడా రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్ పర్సన్ లేకుండానే సభను ప్రారంభించడమే కాకుండా.. ఆమె వచ్చిన తర్వాత కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం పట్ల మంత్రి అఖిలప్రియను కౌన్సిల్ సభ్యులు తప్పు పడుతున్నారు.
కాగా, శోభానాగిరెడ్డి వర్థంతి సభలో పాల్గొన్న అనంతరం అఖిలప్రియ నేరుగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. అయితే అప్పటికీ చైర్ పర్సన్ సులోచన రాకపోవడంతో.. ఆమె లేకుండానే సభను ప్రారంభించారు. కాసేపటికి సులోచన సభకు వచ్చినా.. అఖిలప్రియ ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.

అఖిలప్రియ తీరుతో అసంతృప్తికి లోనైన సులోచన తనకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆమెను నిలదీశారు. సులోచన భర్త, కో ఆప్షన్ సభ్యుడు సుధాకర్ రెడ్డి సైతం అఖిలప్రియ తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డు సమస్యలు ఉంటే చెప్పాలని అడుగుతున్నారే తప్పా, తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని అఖిలప్రియను ప్రశ్నించారు.
ఆ తర్వాత కొద్దిసేపటికి అఖిలప్రియ అక్కడినుంచి వెళ్లిపోయారు. తాను కర్నూల్ వెళ్లాల్సి ఉందని, మీరే మాట్లాడుకోండి అని చెప్పి ఆమె బయలుదేరబోతుండగా సుధాకర్ రెడ్డి అడ్డుపడ్డారు. చైర్ పర్సన్ కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎలా వెళ్లిపోతారని ప్రశ్నించారు. ఓ మంత్రి అయి ఉండి ఇలా వ్యవహరించడం బాధ కలిగించిందని అన్నారు. విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడుతానని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications