జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఆరంభం : మధ్నాహ్నం తరువాత ఫలితాలు : వైసీపీ నేతల్లో ధీమా..!!
ఏపీలో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెల్లడి కాబోతున్నాయి. 7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన ఏడాదిన్నర తర్వాత నేడు వారి భవితవ్యం తేలబోతోంది. ఏప్రిల్ 8వ తేదీన జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హైకోర్టు తీర్పుతో నేడు ఓట్ల లెక్కింపు
హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్ రూంలకే పరిమితం అయ్యాయి. మూడు రోజుల క్రితమే హైకోర్టు డివిజన్ బెంచ్ ఓట్ల లెక్కింపునకు అనుమతించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాల్లోని 209 ప్రదేశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో మండలాల వారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు కోసం వేర్వేరు హాళ్లను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లాల్లో చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్

కౌంటింగ్ ఆరంభం..ఏర్పాట్లు ఇలా
రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 44,155 మంది సిబ్బంది పని చేయనున్నారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కోవిడ్ నింబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇప్పటికే జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థుల తరుఫున హాజరయ్యే ఏజెంట్లు కరోనా వ్యాక్సినేషన్ వేయించుకొని ఉండాలనే ఆదేశాలు వెళ్లాయి. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా ఒక్కో స్థానానికి ఒకటి చొప్పున 7,219 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మధ్నాహ్నం నుంచి ఫలితాల వెల్లడి
515 జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం వేరుగా 4,008 టేబుళ్లను సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్స్‌లు దాచి ఉంచిన స్ట్రాంగ్ రూంలను పోలింగ్ జరిగిన ఐదు నెలల తర్వాత తెరవనున్నారు. దీంతో మొదట బ్యాలెట్ బాక్స్‌లు శుభ్రం చేసుకోవడం వంటి కారణాలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నీర్ణీత సమయం కంటే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీనికితోడు బ్యాలెట్ పేపరు ద్వారా ఎన్నికలు కావడంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఏకపక్షమంటూ వైసీపీ ధీమా
అయినప్పటికీ మధ్యాహ్నం రెండు గంటల సమయానికి దాదాపు అన్ని చోట్ల ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని.. జెడ్పీటీసీ ఫలితాలు మాత్రం రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారుల వర్గాలు పేర్కొన్నాయి. అయితే, మున్సిపల్.. పంచాయితీ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించిన అధికార వైసీపీ ఈ ఫలితాల్లో అదే రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ గెలుపు ఖాయమని భావిస్తున్న వైసీపీ..జెడ్పీ ఛైర్మన్ అభ్యర్ధులను ఖరారు చేసింది.

జెడ్పీ ఛైర్మన్లు ఖరారు
ఇక, ఎంపీపీల విషయంలో మాత్రం పార్టీ అమలు చేస్తున్న సామాజిక లెక్కల ఆధారంగా ఎంపిక చేయాలని స్పష్టం చేసింది. దీంతో..ఇప్పటికే జరిగిన ఏకగ్రీవాల్లో అత్యధికంగా గెలుచుకున్న వైసీపీ..ఇక, మధ్నాహ్నం నుంచి వెల్లడయ్యే ఫలితాల్లోనూ పూర్తిగా ఆధిక్యత సాధిస్తామని ధీమాగా చెబుతోంది.












Click it and Unblock the Notifications