కారుమూరికి బిగ్ రిలీఫ్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనకు తాడిపత్రి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం రాత్రి ఆయనను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. విచారణ అనంతరం న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన విడుదల అయ్యారు. ఏపీ పోలీసులు తెల్లవారు జామున హైదరాబాద్ లో అరెస్టు చేయగా.. రాత్రికి బెయిల్ లభించింది.
తాడిపత్రి పోలీసులు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఆయన ఇంట్లో మంగళవారం తెల్లవారు జామున అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ కల్తీ వ్యవహారంలో విచారణ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీశ్ కుమార్ అనుమానాస్పద మరణించడంపై కారుమూరి వెంకటరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

దీనిపై తాడిపత్రికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రసాద్ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులు వెంకటరెడ్డిపై కేసు నమోదు చేశారు. రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి ఆయనను హైదరాబాదులో అరెస్టు చేసి, అనంతపురానికి తీసుకొచ్చారు. తొలుత గుంతకల్లు డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. రాత్రి తాడిపత్రి కోర్టులో ప్రవేశపెట్టారు. నోటీసులు లేకుండా అరెస్ట్ చేశారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. వాదనలను విన్న అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి (తాడిపత్రి), అనంత వెంకట్రామిరెడ్డి (అనంతపురం), తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి సహా అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలకు చెందిన పలువురు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆ సమయంలో కోర్టు ఆవరణలోనే ఉన్నారు. బెయిల్ పై విడుదలైన కారుమూరిని అభినందించారు.












Click it and Unblock the Notifications