ఆరోగ్యశ్రీలోకి బ్లాక్ ఫంగస్ చికిత్స: ఏపీకి కియా ఇండియా భారీ విరాళం, నాలుగు జిల్లాల్లో సిటీ స్కాన్ సేవలు
అమరావతి: కరోనావైరస్ మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో వస్తున్న బ్లాక్ ఫంగస్ కేసులు ఇప్పుడు ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ బారినపడి ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్ చికిత్స
బ్లాక్ ఫంగస్ కేసులకు చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కరోనా నుంచి కోలుకున్నవారికి వచ్చే బ్లాక్ ఫంగస్‌కు చికిత్స చేయాలన్నారు. అంతేగాక, బ్లాక్ ఫంగస్ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. మరోవైపు బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం జిల్లాల్లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ కేజీహెచ్‌లో బ్లాక్ ఫంగస్ చికిత్సకు పడకలు ఏర్పాటు చేశారు. డెర్మటాలజీ విభాగంలో 20 పడకలను కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.

ఏపీకి కరోనా పోరాటంలో కియా ఇండియా భారీ విరాళం
కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వాలకు పలు సంస్థలు భారీ విరాళాలు ఇచ్చి తమవంతుగా సహకరిస్తున్నాయి. తాజాగా, కరోనా నివారణ, సహాయక చర్యల నిమిత్తం ఏపీలోని కియా ఇండియా భారీ సాయం అందజేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకు రూ. 5 కోట్ల విరాళం ఇచ్చింది. ఈ మేరకు కియా ఇండియా ఎండీ, సీఈవో షిమ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి విరాళం చెక్కులను అందజేశారు. కరోనా చికిత్సలో ఉపయోగించే పరికరాలు కొనుగోలు చేయాలని కోరారు. మరోవైపు విశాఖ జిల్లాలో కరోనా రోగులకు ఆక్సిజన్ కోసం రూ. 35 లక్షల విరాళం ఇచ్చింది హెచ్‌పీసీఎల్. జిల్లా కలెక్టర్‌కు ఈ చెక్కును హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అందజేశారు.

నాలుగు జిల్లాల్లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ సేవలు ప్రారంభించిన జగన్
ఇది ఇలావుండగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిలో భాగంగా నెల్లూరు, ఒంగోలు, కడప, శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి సీటీస్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. భవిష్యత్తులో మరో ఏడు చోట్ల వైద్య పరీక్షల పరికరాలను ఏర్పా చేస్తామన్నారు. కరోనా సమయంలో ప్రాణాల పణంగా పెట్టి శ్రమిస్తున్న వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, వాలంటీర్లు ఎనలేని సేవలు అందిస్తున్నారని సీఎం జగన్ ప్రశంసించారు.












Click it and Unblock the Notifications