విశాఖపట్నాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన వైసీపీ మంత్రులు?
హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజధాని అమరావతి విషయం ముగిసిపోయిందని, ప్రభుత్వం కూడా విజ్ఞత ప్రదర్శించి వేసిన అఫిడవిట్‌ను వెనక్కి తీసుకుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. అంతా ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో మళ్లీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని, అమరావతి రైతులను రెచ్చగొట్టేలా వారి పాదయాత్రపై మంత్రులు మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు. విశాఖపట్నం ఒక్క రాత్రిలోనే అభివృద్ధి చెందలేదన్నారు. ఉక్కు కర్మాగారం, పోర్టులాంటివి వచ్చిన తర్వాతే దశలవారీగా అభివృద్ధి చెందిందనే విషయాన్ని గుర్తుంచకోవాలన్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటు పరం చేస్తున్న అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. వైజాగ్ ను మంత్రులే ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. లేపాక్షి భూములను సీఎం జగన్ మేనమామ కొడుకు కొనుగోలు చేస్తున్నారని, వాటిని రైతులకు వెనక్కివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అక్కడి 29 గ్రామాల్లోని రైతులు చేస్తున్న ఉద్యమం 12వ తేదీతో వెయ్యిరోజులు పూర్తిచేసుకోబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు 60 రోజుల మహా పాదయాత్ర చేయబోతున్నారు. యాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. షరతులతో పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. ఇదే తరుణంలో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం గ్రామ సభలు నిర్వహించడానికి ప్రభుత్వం జీవో జారీచేసింది. అయితే అకస్మాత్తుగా మంత్రులు మళ్లీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖపట్నాన్ని అసలు ధ్వంసం చేసిందే మంత్రులంటూ వారిపై నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications