ఎందుకు మాట్లాడలేదు, చిత్తుశుద్ధి ఉంటే..: పవన్ కళ్యాణ్‌పై రామకృష్ణ
కాకినాడ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమానంగా ఏకి పారేయడంపై సిపిఐ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, అదే సమయంలో పవన్ కళ్యాణ్‌పై కాస్తా అసంతృప్తిని కూడా వ్యక్తం చేసింది.
కలిసి పనిచేద్దామంటూ ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకుడు రామకృష్ణ పవన్ కళ్యాణ్‌కు పిలుపునిచ్చారు. ఓటుకు నోటు కుంభకోణంపై ఆలస్యంగా స్పందించిన పవన్ కళ్యాణ్ అన్ని విషయాలూ మాట్లాడలేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అవమానానికి గురయ్యారనే విషయంపై పవన్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు కాంగ్రెసు పార్టీ అవినీతిపై పవన్ కళ్యాణ్ మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినవాళ్లు ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
పవన్ కళ్యాణ్ తీరుపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications