హిందూపురంలో అవినీతి పెరిగింది: 'బాలకృష్ణ ఉత్తుత్తి హీరోనే'
అమరావతి: సినిమాల్లో అవినీతిని అంతమొందించే పాత్రలు పోషించే సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదని, ఆయన ఉత్తుత్తి హీరోనేనని అనంతపురం జిల్లా సీబీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ఆరోపించారు.
మంగళవారంలో హిందూపురంలో సీపీఐ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకురులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో అవినీతి పేరుకుపోయిందని ధ్వజమెత్తారు.
అనంతపురం జిల్లాకు ప్రాణపదమైన హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేయడంతో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. హంద్రీనీవా జలసాధన కోసం జిల్లాలోని నేతలను కలిసి త్వరలో కార్యాచరణ రూపొందించి హిందూపురం నుంచి గుంతకల్లు వరకు బస్సు యాత్ర చేపడతామని చెప్పారు.

సీపీఐ, వైసీపీ పోరాట ఫలితంగా అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో కొద్దో, గొప్పో నీళ్లు లభిస్తున్నాయని చెప్పారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలకు 13 టీఎంసీల నీళ్లు అందించాల్సి ఉన్నప్పటికీ, చుక్కనీటిని కూడా ప్రభుత్వం అందించడం లేదన్నారు.
వైఎస్ హయాంలో స్వాధీనం చేసుకున్న లేపాక్షి భూములను అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు వెనక్కిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా రైతులకు భూములను వెనక్కి ఇప్పించలేదని విమర్శించారు. అంతేకాదు ఆ భూముల్లో ఇప్పటివరకు ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని అన్నారు.












Click it and Unblock the Notifications