andhra pradesh bhimavaram cpi narayana chandrababu pawan kalyan bjp boycott comments భీమవరం సీపీఐ నారాయణ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరుపతి ఉపఎన్నిక బీజేపీ బహిష్కరణ వ్యాఖ్యలు politics
పాచిపోయిన లడ్డూలు తింటావా పవన్-పారిపోతావా చంద్రబాబు- నారాయణ సెటైర్లు
ఏపీలో జరుగుతున్న తిరుపతి ఉపఎన్నిక, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తున్నాయి. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ గెలుపు కోసం పవన్ పనిచేస్తుండగా.. పరిషత్ పోరును టీడీపీ బాయ్‌కాట్ చేసింది. దీంతో ఈ రెండు అంశాలపై పవన్ కళ్యాణ్. చంద్రబాబును టార్గెట్ చేస్తూ సీపీఐ నారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆయా ఎన్నికల్లో వీరిద్దరూ అనుసరిస్తున్న వైఖరిపై నారాయణ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

చంద్రబాబు, పవన్‌పై సీపీఐ నారాయణ ఫైర్
ఏపీలో జరుగుతున్న పరిషత్ ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నికలో విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన స్దాయికి తగ్గట్టుగా వ్యవహరించడం లేదని సీపీఐ నారాయణ ఇవాళ మండిపడ్డారు. తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా పవన్ కళ్యాణ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వచ్చిన నారాయణ చంద్రబాబు, పవన్‌పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

పాచిపోయిన లడ్డూలు కమ్మగా ఉన్నాయా పవన్ ?
తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సీపీఐ నారాయణ మండిపడ్డారు. పాచిపోయిన లడ్డూల కేంద్రం తిరుపతిలో కూర్చుని బీజేపీకి ప్రచారం చేస్తున్నావా అంటూ పవన్ కళ్యాణ్‌ను నారాయణ ఎద్దేవా చేశారు. గతంలో పాచిపోయిన లడ్డూలంటూ బీజేపీపై విమర్శలు చేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ప్రచారం చేస్తున్నావంటూ పవన్‌ను ప్రశ్నించారు. అప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు కమ్మగా, తియ్యగా ఉన్నాయా అని పవన్‌ను నారాయణ ప్రశ్నించారు.

ఎన్నికల్ని వదిలి పారిపోతావా చంద్రబాబూ?
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని సైతం సీపీఐ నారాయణ తప్పుబట్టారు. ఎన్నికలను ఎదుర్కోకుండా పారిపోతే ఎలా అని చంద్రబాబును ప్రశ్నించారు. సీఎంగా పనిచేసి, 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఎన్నికలను బహిష్కరిస్తే పార్టీ, క్యాడర్ ఏమై పోతాయని నారాయణ నిలదీశారు. బతికుండి ఓటేయకపోతే చచ్చినట్లే అని చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

90 శాతం గెలిస్తే వైసీపీకి ఏకగ్రీవాలెందుకు?
రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాలు 90 శాతం తమకు అనుకూలంగా వచ్చాయని చెప్పుకుంటున్న వైసీపీపైనా నారాయణ నిశిత విమర్శలు చేశారు. అలాగైతే నామినేషన్లను అడ్డుకోవాల్సిన పరిస్ధితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. అధికార యంత్రాంగం, పోలీసులు, రౌడీలను వాడి ఎన్నికలను ఏకపక్షం చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందని వైసీపీ నేతలను సీపీఐ నారాయణ ప్రశ్నించారు. పరిషత్ పోరులో కమ్యూనిస్టులకు ఓటేసి గెలిపించాలని కోరారు.