అమిత్ షా లా జగన్ ..! ఇష్టంలేకపోయినా బాబు-పవన్ స్పీచ్ వీక్-నారాయణ సెటైర్లు..!
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సీపీఐ నారాయణ మరోసారి సెటైర్లు వేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను వీళ్లతో లింక్ చేస్తూ మరీ పంచ్ లు వేశారు. రాష్ట్రంలో ఈ ముగ్గురి తాజా పరిస్ధితిపై నారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
మోడీ, ట్రంప్ లు ఎంత దుర్మార్గులో అందరికీ తెలుసని నారాయణ తెలిపారు. అందుకే వారిద్దరూ మిత్రులు అని ప్రకటించుకున్నారన్నారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని మోడీ క్లీన్ చిట్ సంపాదించారని ఆరోపించారు. గుజరాత్ లో మైనారిటీలను ఊచకోత కోయలేదా, గోద్రా అల్లర్లు జరగలేదా అని ప్రశ్నించారు. కోర్టు తీర్పు ఇస్తే... చెడు మంచి అవుతుందా అని ప్రశ్నించారు. ప్రజలు భయపడి ఓట్లు వేసే పరిస్థితి కి మోడీ తెచ్చారన్నారు. హత్య కేసులో పాత్ర ఉన్నట్లు అమిత్ షా పై నిర్ధారణ అయ్యింది కదా అని అడిగారు. ఆ తర్వాత 12 మందిని చంపితే గానీ అమిత్ షా నిర్ధోషి గా బయట పడలేదన్నారు. సమాజంలో మాత్రం అమిత్ షా దోషిగా నే మిగిలారన్నారు.

ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే పంధాను కొనసాగిస్తున్నారని నారాయణ ఆరోపించారు. సాక్షుల్ని చంపడంలో మోడీ, అమిత్ అడుగు జాడల్లో జగన్ నడుస్తున్నారన్నారు. అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయాలని అంబేద్కర్ రాజ్యాంగం లో చెప్పారని, ఇప్పుడు మెజారిటీ వర్గాలు చెప్పిందే న్యాయం అన్న విధంగా మోడి తీరు ఉందన్నారు. హిందీ వివాదంపై స్పందిస్తూ.. అందరిపైనా ఒక్క హిందీ రుద్దాలంటే కరెక్ట్ కాదని, దీనిని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
డీ లిమిటేషన్ జరిగితే భారీగా సీట్లు పెరగవని సీపీఐ నారాయణ తెలిపారు. కుటుంబ నియంత్రణ పాటిస్తే తక్కువ సీట్లు, పాటించకుంటే ఎక్కువ సీట్లు వస్తాయని అంటున్నారని, చంద్రబాబు ఇప్పుడు ముగ్గురు, ఆపైన కనండి అంటున్నారని నారాయణ గుర్తుచేశారు. స్త్రీలు యంత్రాలు కాదని, ఇది అసంబద్దమైన విధానమని విమర్శించారు. చంద్రబాబు మోడీ మీద కొట్లాడలేడని, వ్యతిరేకించలేడని, ఇష్టం ఉన్నా లేకున్నా మోడి తోనే చంద్రబాబు కలిసి నడవాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే దేశంలో సౌత్, నార్త్ అనే బేధాలతో విడిపోయే ప్రమాదం ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ లో చాలా నాలెడ్జ్ ఉందని, లెప్ట్ భావజాలం ఉందని నారాయణ తెలిపారు. జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం నిరుత్సాహపరిచిందని నారాయణ తెలిపారు. ఆయన జనసేన అధినేత గా కాకుండా యాక్టర్ గా వ్యవహరించాడన్నారు.ఎవరో రాసిన స్క్రిప్ట్ ను ఆయన చదివాడన్నారు. ఆయన సొంత వ్యాఖ్యలు కావన్నారు. సనాతన ధర్మం గురించి పూర్తిగా పవన్ కు తెలుసా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో చిత్ర విచిత్రంగా మాట్లాడే వాళ్లను ఏమంటారని అడిగారు. డిప్యూటీ సిఎం గా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడితే ప్రజలు ఎలా అర్ధం చేసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications