
వైసీపీ-బీజేపీ స్నేహం నరేష్-పవిత్ర బంధంలాంటిదే- సీపీఐ రామకృష్ణ- కోటగిరి వ్యాఖ్యలు కరెక్టే
ఏపీలో వైసీపీ-బీజేపీ స్నేహం తాజాగా మరోసారి చర్చనీయాంశమవుతోంది. తాజాగా ప్రధాని మోడీ భీమవరం టూర్ సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు, అల్లూరి జయంతి నిర్వహణ చూస్తే వైసీపీ-బీజేపీ కార్యక్రమంలాగే సాగిందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా ఇందులో దాపరికమేమీ లేదని తేల్చిచెప్పేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై ఇవాళ సీపీఐ రామకృష్ణ ఘాటుగా స్పందించారు.
వైసీపీ-బీజేపీ బంధంపై వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ తాజాగా తిరుమలలో చేసిన వ్యాఖ్యల్ని సీపీఐ రామకృష్ణ సమర్ధించారు. ఆయన్ను అభినందిస్తున్నట్లు ఇవాళ రామకృష్ణ తెలిపారు. అదే సమయంలో బీజేపీతో స్నేహం కారణంగా వైసీపీ రాష్ట్రానికి నిధులు తెస్తోందన్న వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారని కోటగిరి చెప్పారని, ఇప్పటివరకూ ఏమిచ్చారో చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రతి బిల్లుకు వైసీపీ ఎంపీలు(YCP MPs) బీజేపీకి మద్దతిచ్చామని చెప్పారని.. రాష్ట్రానికి హోదా, విభజన హామీలు ఏమిచ్చారో చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తామంటే ఏమీ మాట్లాడలేదని రామకృష్ణ మండిపడ్డారు.

అంతటితో ఆగకుండా వైసీపీ-బీజేపీ పొత్తుపై సీపీఐ రామకృష్ణ మరో ఆసక్తికర పోలిక కూడా తెచ్చారు. వైసీపీ-బీజేపీ బంధం నరేష్-పవిత్ర మాదిరిగా పెళ్లి కాకుండా బీజేపీ-వైసీపీ సహజీవనం చేస్తున్నట్లుగా ఉందన్నారు. మూడు సంవత్సరలుగా బీజేపీ, వైసీపీ రంకు రాజకీయం నడుపుతున్నారని రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. షరతులతో బీజేపీ ప్రభుత్వంలో వైసీపీ చేరతామంటున్నారని ఆయన విమర్శించారు.