జీవో నంబర్ 1 పై మరో ట్విస్ట్ - హైకోర్టు తీర్పుపై 24న తేల్చనున్న సుప్రీంకోర్టు
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను సవాల్ చేస్తూ సీపీఐ రామకృష్ణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తయినా తీర్పు మాత్రం ఇంకా వెలువడలేదు. దీంతో ఆయన ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు ఆలస్యాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

ఏపీలో రాజకీయ పార్టీల నేతలు రోడ్లపై సభలు, సమావేశాలు నిర్వహించకుండా ప్రభుత్వం రెండు నెలల క్రితం జీవో నంబర్ 1 ను తీసుకొచ్చింది. దీనిపై రాజకీయ పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇందులో భాగంగానే సీపీఐ రామకృష్ణ హైకోర్టులో ఈ జీవో ను సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషనర్ రామకృష్ణ ఉద్దేశాన్ని సైతం ప్రశ్నించింది. అయితే వాద ప్రతివాదుల వాదనలు విన్న తర్వాత విచారణ ముగించిన హైకోర్టు తీర్పును మాత్రం వాయిదా వేసింది.

జీవో నంబర్ 1పై హైకోర్టు తీర్పు ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో పోలీసులు ఈ జీవోలో అంశాల్ని అమలు చేస్తుండటాన్ని తప్పుబడుతున్న పిటిషనర్ రామకృష్ణ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రామకృష్ణ పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఈ నెల 24న దీనిపై విచారణ జరిపేందుకు నిర్ణయించింది. రామకృష్ణ ఈ పిటిషన్ లో హైకోర్టు తీర్పు ఆలస్యాన్ని ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications