కారత్ సంకేతాలు: వైయస్ జగన్‌తో సిపిఎం పొత్తు?
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో రాష్ట్రంలో సిపిఎం ఎన్నికల పొత్తు పెట్టుకోవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ శనివారం చేసిన వ్యాఖ్యలు ఆ సంకేతాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కాంగ్రెసేతర లౌకిక పార్టీగా, కాంగ్రెసేతర ప్రతిపక్ష లౌకిక పార్టీగా గుర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాదు వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసు, బిజెపియేతర కూటమి ఏర్పాటుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే, రాష్ట్రంలో పొత్తులపై రాష్ట్ర కమిటీ మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకే పరిమితమని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలకు సమాయత్తమవుతోందని ఆయన చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు తమ విధానాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
సిపిఐతో పొత్తు విషయంపై తమ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ మతతత్వ పార్టీతో స్నేహం చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణపై పార్లమెంటులో నిర్ణయం వచ్చిన తర్వాతనే వ్యూహాలను ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. బిజెపి, కాంగ్రెసు విధానాల్లో పెద్దగా మార్పు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications