వెంకయ్యకు తలనొప్పి: రోజుకో మలుపు తిరుగుతున్న బెజవాడ లొల్లి
విజయవాడ: ప్రత్యేక హోదా విషయంలో 'ప్యాకేజీ'తో విపక్షాలకు కౌంటర్ ఇచ్చిన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఇప్పుడు ఏపీలో పార్టీ పరంగా తలనొప్పులు వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా విజయవాడలో రగులుతున్న ఇంటిపోరుతో ఆయన సతమతమవుతున్నారని చెబుతున్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వర రాజు సస్పెండ్ కావటం ఆపై చోటు చేసుకుంటున్న పరిణామాలు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెబుతున్నారు. అయితే, పార్టీ అనుబంధ సంస్థలన్నీ ఆయన వెంటే ఉండటం గమనార్హం.
ఇది పార్టీ అధిష్టానాన్ని అయోమయానికి గురి చేస్తోంది. తొలుత నగర కార్యవర్గం సమావేశమై ఆ సస్పెన్షన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంటనే ఉపసంహరించుకోవాలని తీర్మానం చేయటమే గాక ఆ తీర్మానం కాపీని నేరుగా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి పంపించారు.

యువమోర్చా, ఎస్సీ మోర్చా, మైనార్టీ మోర్చా, గిరిజన మోర్చా తదితర కమిటీలు మూకుమ్మడిగా డాక్టర్ దాసం సస్పెన్షన్‌ను ఖండించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి వెంకయ్య మంగళవారం విజయవాడ నగరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ నెల 15న విశాఖపట్టణంలో జరిగే కీలకమైన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చకు రానుందని అంటున్నారు. ఈ కమిటీలో రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుతో పాటు మరో ఎంపి గంగరాజు, ఇద్దరు మంత్రులతో సహా నలుగురు శాసనసభ్యులు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ హాజరుకాబోతున్నారు.
మరోవైపు, డాక్టర్ దాసం తాజాగా పార్టీ బైలాను తెరపైకి తెచ్చారు. నిబంధనల ప్రకారం జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు మినహా ఏ ఒక్కరితో తమ ఇష్టానుసారం వ్యవహరించే వీలులేదని చెబుతున్నారు. ముందుగా షోకాజ్ నోటీస్ జారీ చేయకుండా ప్రధాన కార్యదర్శి శ్యాంకిషోర్ తనకు సస్పెన్షన్ నోటీస్‌ను జారీ చేశారని చెబుతున్నారు. దీనిని ప్రశ్నించటంతో షోకాజ్ నోటీస్ జారీ చేశారన్నారు.












Click it and Unblock the Notifications