తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. స్వామివారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం..
కళియుగ వైకుంఠ దైవమైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు ఓ శుభవార్త. తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. వీకెండ్ అయినా భక్తుల రద్దీ పెదగ్గా లేకపోవడంతో స్వామివారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులు సులభంగానే దర్శనం చేసుకుంటున్నారు. అతి తక్కువ వ్యవధిలోనే భక్తులు తిరుమల స్వామివారి సేవలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు.
సాధారణ రోజుల్లోనే ఇక్కడ భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక, వీకెండ్‌లో అయితే, చెప్పక్కర్లేదు. అలాంటిది ఆదివారం అయినా ఇక్కడ భక్తుల రద్దీ సాధారణంగనానే కొనసాగుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా వీకెండ్ కూడా భక్తుల సంఖ్య స్వల్పంగా ఉండటం ఇదే మొదటిసారని టీటీడీ అధికారులు వెల్లడించారు.

తిరుమల ఆలయంలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనం కోసం క్యూ లైన్ లోకి ఉదయం 7 గంటలకు టోకెన్లు లేకుండా వెళ్లిన భక్తులకు శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి కేవలం ఎనిమిది గంటల మాత్రమే సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
శనివారం (సెప్టెంబర్ 21) వరకూ శ్రీనివాసుడి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పట్టేది. కానీ, నేడు టైమ్ స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి స్వామివారి దర్శనం కేవలం మూడు గంటల్లోనే పూర్తయిపోతుంది. ఇక, ఇందులో రూ. 300 స్పెషల్ దర్శన టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు చెబుతున్నారు.
స్వామివారి హుండీ ఆదాయం..
నిన్న(శనివారం) ఒక్కరోజే శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కోసం సుమారు 82 వేల 406 మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు. ఇక, వీరిలో 31 వేల 151 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మరీ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయల వచ్చిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications