అర్ణబ్ తుఫాన్ పై రైతులకు ఏపీ సర్కార్ కీలక సూచనలు..! ఇలా చేస్తే సేఫ్..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్ణబ్ తుఫాను (Cyclone Arnab) తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (AP Govt) రాష్ట్రంలోని ప్రజలు, రైతులు, మత్స్యకారులు, పశుపోషకులు, పౌల్ట్రీ రైతులకు ఇవాళ కీలక హెచ్చరికలు, సూచనలు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వారిని ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇవాళ అర్ధరాత్రికి అర్ణబ్ తీవ్ర తుఫానుగా, రేపు అత్యంత తీవ్ర తుఫానుగా బలపడి, 28వ తేదీ ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్-యానాం తీరాన్ని దాటే అవకాశముందన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 115-125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 140 కిలోమీటర్లకు చేరవచ్చని హెచ్చరించారు. రేపు, ఎల్లుండి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదమున్నందున అధికారులు జారీచేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
తుఫాను ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ముఖ్యంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, మినుము, పెసర, కంది తదితర పంటలను వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు కోసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తులు తడవకుండా టార్పాలిన్లతో కప్పి భద్రపరచుకోవాలన్నారు. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువలను శుభ్రం చేయాలని, వరి పైరుపై వర్షాల సమయంలో యూరియా, ఇతర ఎరువుల పైపూతను వాయిదా వేయాలని సూచించారు. పత్తిలో పింక్ బోల్‌వార్మ్, తామర పురుగులు, మొక్కజొన్నలో కాండం కుళ్లు, కత్తెర పురుగు, వేరుశనగలో టిక్కా ఆకుమచ్చ, వేరు కుళ్లు, పప్పుధాన్యాల్లో కాయ తొలిచే పురుగుల ఉధృతిని వర్షాల అనంతరం పరిశీలించాలన్నారు. తడిసిన పత్తి, ధాన్యం, కాయలు, గింజలను పూర్తిగా ఆరబెట్టాకే నిల్వ చేయాలన్నారు.

అలాగే మిరప, టమాటా, వంగ, బెండ తదితర కూరగాయల పొలాల్లో నీటి పారుదల సక్రమంగా ఉండేలా చూడాలని, తీగజాతి పంటల పందిళ్లను బలపరచాలని మంత్రి తెలిపారు. అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలకు మద్దతు కర్రలు ఏర్పాటు చేయాలని, పండిన పండ్లు, కూరగాయలను అనుకూల వాతావరణంలో కోసి భద్రపరచుకోవాలన్నారు. చెరకు, ఇతర నిలువు పంటలు గాలులకు పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాల తరువాత ఆకుమచ్చలు, బ్యాక్టీరియా వ్యాధులు, కాండం, వేరు కుళ్లు లక్షణాలను పరిశీలించాలని తెలిపారు. వర్షాలు కురుస్తున్నప్పుడు పురుగుమందుల పిచికారీ చేయకూడదని, పంట పరిస్థితిని బట్టి శాస్త్రవేత్తల సలహాతో మాత్రమే ఎరువులు, మందులు వినియోగించాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ధాన్యం బస్తాలను ఎత్తైన ప్రదేశాల్లో ఉంచాలని, కోత యంత్రాలు, ట్రాక్టర్లు, పంపుసెట్లు, డ్రిప్ వ్యవస్థలు, విద్యుత్ మోటార్లను వరదనీటి నుంచి రక్షించుకోవాలన్నారు.

తుఫాను అనంతరం పొలాల్లో నిల్వ నీటిని తొలగించి పంటలు, పశువులు, కోళ్ల షెడ్లు, వ్యవసాయ పరికరాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలన్నారు. నష్టానికి సంబంధించిన ఫొటోలు, పత్రాలను భద్రపరచుకుని సంబంధిత అధికారులకు, బీమా సంస్థలకు నిబంధనల ప్రకారం తెలియజేయాలన్నారు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సూచనలను స్థానిక వాతావరణ పరిస్థితులు, పంట దశ, నేల స్వభావానికి అనుగుణంగా పాటించాలని కోరారు. భారత వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖల నుంచి వెలువడే అధికారిక సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలని, వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. పంటలు, ఆస్తులను కాపాడుకునే ప్రయత్నంలో రైతులు, ప్రజలు ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని, ముందస్తు అప్రమత్తతతోనే తుఫాను నష్టాన్ని తగ్గించుకోవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.














Click it and Unblock the Notifications
