బీ అలర్ట్, ఏపీకి భారీ వర్షాలు- స్కూళ్లకు సెలవు, తాజా హెచ్చరికలు..!!
ఫెంగల్ తుఫాను బలహీనపడినా.. ప్రభావం కొనసాగుతోంది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. మరో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు భారీ పంట నష్టం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
తాజా హెచ్చరికలు
ఫెంగల్ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. తుఫాన్ ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో అనేకచోట్ల భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురిసాయి. వరి, పత్తి, మరికొన్ని పంటలకు నష్టం వాటిల్లింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల, ఉత్తరకోస్తా లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రిడ్జ్ ప్రభావంతో ఫెంగల్ తుఫాన్ తీరందాటిన తరువాత కూడా అక్కడే ఉండిపోయిందని విశ్లేషించారు.

రికార్డు వర్ష పాతం
తుఫాన్ ప్రభావంతో 24 గంటల్లో తిరుపతి జిల్లా పుత్తూరులో రికార్డు స్థాయిలో 187 మిల్లీమీటర్ల వాన పడింది. మనుబోలులో 153.2, రాచపాలెంలో 152.5, సూళ్లూరుపేట మండలం మన్నార్పోడులో 149.25, తడ మండలం భీములవారిపాలెంలో 137, చిటమూరు మండలం మల్లాంలో 134.5, నెల్లూరు జిల్లా మునుబోలులో 133.5, దొరవారిసత్రం మండలం పూలతోటలో 124, నగరిలో 120.75, సూళ్లూరుపేటలో 118 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని 4,463 హెక్టార్లలో పంటలు ముంపునకు గురైనట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.
మరో రెండు రోజులు
రానున్న 48గంటల్లో కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తిరుమలలో వర్షంతో పాటుగా చలి కూడా బాగా పెరగడంతో చాలా మంది భక్తులు దర్శనం పూర్తికాగానే తిరుగు ప్రయాణమయ్యారు. దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేసింది. రెండవ ఘాట్‌రోడ్డులో 14, 15 కిలోమీటర్ల వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాలకు తిరుమల కొండపై ఉన్న ఐదు డ్యామ్‌లు నిండుతున్నాయి. మరో రెండు రోజులు రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.












Click it and Unblock the Notifications