Cyclone Michaung: ఏపీలో సూపర్ సైక్లోన్ తీరాన్ని తాకేది అక్కడే: రెడ్ అలర్ట్ జారీ
Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛౌంగ్ తుఫాన్ ఉగ్రరూపాన్ని ధరించింది. పెను తుఫాన్‌గా ఆవిర్భవించింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నెల్లూరు- మచిలీపట్నం మధ్య ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుఫాన్- ఆదివారం రాత్రి 11:30 గంటల సమయానికి పుదుచ్చేరికి తూర్పు- ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో 210, చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సాయంత్రానికి ఏపీ తీర ప్రాంతానికి మరింత చేరువ అవుతుంది. ఈ నెల 5వ తేదీన ఉదయం నెల్లూరు- మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది.

ప్రస్తుతం గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది మిఛౌంగ్ తుఫాన్. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదురుగాలులు వణికిస్తాయి. ఇప్పటికే ఏపీ, తమిళనాడుల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.
చెన్నై సహా తమిళనాడులోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తాంబరం ప్రాంత ప్రజలను ప్రభుత్వం ఖాళీ చేయించింది. వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించింది. భారీ వర్షంలోనూ మంత్రి ఉదయనిధి స్టాలిన్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.
వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఏపీలో. తీరానికి సమీపించకముందే తన ప్రతాపాన్ని చూపిస్తోంది మిఛౌంగ్ తుఫాన్ (Cyclone Michaung). తిరుపతిలో అతి భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలో కుండపోత వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లాలోని ఏర్పాడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలుడు యశ్వంత్ మరణించాడు.
నెల్లూరు, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. శనివారం నుంచీ ఏకధాటిగా ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తోన్నాయి. తుఫాన్ తీరానికి సమీపించిన తరువాత వర్ష తీవ్రత మరింత ఉధృతమౌతుందని, వచ్చే 48 గంటల పాటు ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని, 204.4 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది.












Click it and Unblock the Notifications