ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయండి: జగన్ కీలక ఆదేశాలు
YS Jagan: బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛౌంగ్ తుఫాన్ (Cyclone Michaung) ఉగ్రరూపాన్ని ధరించింది. పెను తుఫాన్‌గా ఆవిర్భవించింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నెల్లూరు- మచిలీపట్నం మధ్య ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుఫాన్- ఆదివారం రాత్రి 11:30 గంటల సమయానికి పుదుచ్చేరికి తూర్పు- ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో 210, చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సాయంత్రానికి ఏపీ తీర ప్రాంతానికి మరింత చేరువ అవుతుంది. ఈ నెల 5వ తేదీన ఉదయం నెల్లూరు- మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పగడ్బందీగా సహాయక చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాంత ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ఆహారం, మంచినీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. విద్యుత్, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బ తినే ప్రమాదం ఉందని, తుఫాన్ తీవ్రత తగ్గిన తరువాత యుద్ధప్రాతిపదికిన వాటిని పునరుద్ధరించడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని చెప్పారు.

తుఫాన్ పరిస్థితులు, ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదికలను పంపించాలని జగన్ ఆదేశించారు. పొలాలు, కల్లాల్లో ధాన్యం తడిచి పోకుండా ప్రత్యేక చర్యలను తీసుకోవాలని, వాటిని నిల్వ ఉంచడానికి సమీపంలో ఉన్న మిల్లులు లేదా గోడౌన్ల వంటి ప్రదేశాలకు తరలించాలని అన్నారు.
తుఫాన్ ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జలవనరులశాఖ అప్రమత్తంగా ఉండాలని, చెరువుల గట్లు తెగేలా ఉంటే తక్షణ చర్యలకు దిగాలని వైఎస్ జగన్ ఆదేశించారు. తుఫాన్ తరువాత గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వరద నీటిని తోడివేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకు సూచించారు.












Click it and Unblock the Notifications