Laila 2.O: తుఫాన్ ప్రభావం అతి తీవ్రం: ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ
Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. మరింత బలపడింది. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయాల గగనతలంపై కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ఆదివారం ఉదయం నాటికి తుఫాన్‌గా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ ఉదయం 11:30 గంటల సమయానికి ఈ వాయుగుండం పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో 440 కిలోమీటర్లు, చెన్నై- 420, నెల్లూరు- 650, బాపట్ల- 640, మచిలీపట్నం- 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతుంది.

వచ్చే 24 గంటల్లో మిఛౌంగ్ తుఫాన్ (Cyclone Michaung)గా మారుతుందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్‌గా ఆవిర్భవించిన అనంతరం క్రమంగా ఇది ఏపీ తీరం వైపు దూసుకొస్తుందని అంచనా వేసింది. ఈ నెల 4వ తేదీన సాయంత్రం నెల్లూరు- మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది.
తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నెల్లూరు, ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది. ప్రాణనష్టాన్ని నివారించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఈ సాయంత్రం లేదా ఆదివారం ఉదయం నుంచి తీర ప్రాంతవాసులను సురక్షిత ప్రదేశాలకు తరలించే అవకాశం ఉంది.
తుఫాన్ తీవ్రత అంచనాలకు మించి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. 2010లో ఏపీని కుదిపేసిన లైలా తుఫాన్‌తో దీన్ని పోల్చుతున్నారు వాతావరణ నిపుణులు. దీన్ని లైలా 2.Oగా అభివర్ణిస్తోన్నారు. తిరుపతి, నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు కోస్తా తీరం వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ.. కీలక ఆదేశాలను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం ఆదివారం నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తుందని, నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని వివరించింది.
Deep depression over Southwest Bay of Bengal lay centered at 1130 hrs IST of 2nd Dec over same region about 440 km east southeast of Puducherry 420 km southeast of Chennai 540 km southeast of Nellore 650 km south southeast of Bapatla and 650 km south southeast of Machilipatnam pic.twitter.com/hBMKtjama9
— India Meteorological Department (@Indiametdept) December 2, 2023
దీని ప్రభావంతో ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు మంగళవారం వరకు చేపలవేటకు వెళ్లకూడదని సూచించింది. ఈ మేరకు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ప్రకటన జారీ చేశారు.












Click it and Unblock the Notifications