Cyclone Michaung: నెల్లూరు సమీపంలో సూపర్ సైక్లోన్ తిష్ఠ : బాపట్ల-మచిలీపట్నం తీరం మొత్తం డేంజర్
బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛౌంగ్ తుఫాన్ మహోగ్రంగా మారింది. అతి పెను తుఫాన్‌గా ఆవిర్భవించింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నెల్లూరు- మచిలీపట్నం మధ్య ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుఫాన్- నెల్లూరు తీరానికి అతి సమీపానికి చేరింది. ఈ తెల్లవారుజామున 2:30 గంటల సమయానికి నెల్లూరుకు ఈశాన్య దిశగా బంగాళాఖాతంలో 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి 170, బాపట్లకు 150, మచిలీపట్నానికి 210 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ సాయంత్రానికి బాపట్ల- మచిలీపట్నం మధ్య, బాపట్లకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని వేగం కొద్దిగా మందగించింది. ఇదివరకు గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదలగా.. ఇప్పుడు 12 కిలోమీటర్లకు పరిమితమైనట్లు ఐఎండీ పేర్కొంది.
తీరానికి సమాంతరంగా కదులుతుండటం వల్ల నెల్లూరు నుంచి మచిలీపట్నం వరకు అతి తీవ్రమైన, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈదురుగాలుల తీవ్రత గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉంటుందని స్పష్టం చేసింది.
తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే చెన్నై సహా తమిళనాడులోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, బాపట్ల, అన్నమయ్య రాయచోటి, జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి.
శనివారం నుంచీ ఏకధాటిగా ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తోన్నాయి. తుఫాన్ తీరానికి సమీపించిన తరువాత వర్ష తీవ్రత మరింత ఉధృతమౌతుందని, వచ్చే 48 గంటల పాటు ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని, 204.4 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది.












Click it and Unblock the Notifications