Montha Cyclone Effect: మీ మెబైల్ ఫోనుకే తుపాను అప్డేట్స్..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి..'మొంథా' తుపానుగా మారిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు తుపాను అప్డేట్స్ ను రేపటి నుంచి కోటిమందికి పైగా ఫోన్ లకు అలార్మింగ్ సందేశాలను పంపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(APSDMA) స్పష్టం చేసింది. ఫోన్ వైబ్రేటింగ్ అవుతూ తుపాను సందేశాలు ఎప్పటికప్పుడు వాయిస్ రూపంలో వస్తాయని పేర్కొంది. ప్రజలు వెంటనే అప్రమత్తం అయ్యేందుకు ఇవి దోహదపడతాయని స్పష్టం చేసింది. అయితే ఇందుకోసం మెసేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్లి వైర్ లెస్ మెసేజ్ ఆప్షన్ ను ఆన్ లో ఉంచుకోవాలి. ఈ విధానం గతంలో ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చి రెండేళ్లపాటు అమలు చేశారు. ఇప్పుడు ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనసాగిస్తోంది.
ఇక మొంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు APSDMA పేర్కొంది. NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగినట్లు స్పష్టం చేసింది. మరోవైపు నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మొంథా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి. మీ వేగంతో కదిలిందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఇది చెన్నైకి 420 కి. మీ దూరంలో అలాగే విశాఖపట్నంకు 500 కి. మీ దూరంలో, కాకినాడకి 450 కి .మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడుతుందని వెల్లడించారు. రేపు రాత్రి సమయంలో మచిలీపట్నం- కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 90-110 కి. మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. రేపు కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు, అలాగే శ్రీకాకుళం- నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఈ మేరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది. మొంథా తుపాను 233 మండలాల్లోని 1419 గ్రామాలు ,44 మున్సిపాలిటీల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2,194 రిలీఫ్ క్యాంపులు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావంతో కృష్ణపట్నం పోర్టులో ఐదో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. కృష్ణపట్నం పోర్టులో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఇక మొంథా తుపాను కారణంగా రేపు విజయవాడలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA స్పష్టం చేసింది. విజయవాడలో రేపు 16 సెం. మీ వర్షపాతానికి పైగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచనలు చేసింది. తుపాను తీవ్రత దృష్ట్యా దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని విజ్ఞప్తి చేసింది. మెడికల్ షాపులు, కూరగాయల దుకాణాలు తెరుచుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications