అసని తుపాను - ఉత్తరాంధ్ర పై ఎఫెక్ట్ : ఈదురుగాలులు - పిడుగులతో పలువురు మృతి..!!
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను మరికొద్ది గంటల్లో బలపడి తీవ్ర తుపానుగా మారనుంది. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. భీకర గాలుల ధాటికి పంటల తీవ్రంగా దెబ్బతిన్నాయి. పిడుగులు పడి పలువురు మృతిచెందారు.ప్రస్తుతం ఇది కార్ నికోబార్ దీవికి వాయవ్యంగా 610 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ మే 10వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువగా వస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.

ఈదురుగాలులు బీభత్సం
అక్కడి నుంచి దిశ మార్చుకుని ఉత్తర వాయవ్య దిశగా పయనించనున్నట్టు అధికారులు తెలిపారు. అసని గత 6 గంటలుగా గంటకు 14 కిమీ వేగంతో కదులుతోందని ఐఎండీ తెలిపింది. పలు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కళ్లాలలోనే ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతుల తంటాలు పడ్డారు. రావులపాలెంలో ఈదురుగాలులు అలజడి సృష్టించాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ధాన్యం రాశులు కళ్లాలలోనే ఉండగా ...రైతులు తడవకుండా జాగ్రత్తపడ్డారు. విజయవాడ నగరంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దుమ్ముతో కూడిన ఈదురుగాలులు రావటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

పలువురు మృతి -పంట నష్టం
విజయవాడ అవనిగడ్డ కృష్ణా కరకట్ట పై ఉన్న వృక్షాలు నెలకొరగడంతో బస్సులు ఆగిపోయాయి. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ఈదురుగాలుల ప్రభావానికి వేర్వేరు చోట్ల ఇద్దరు యువకులు మృతి చెందారు. నిజాంపట్నం మండలం బొలగాని వారి పాలెంలో తాడి చెట్టు విరిగి పడి గోపీనాథ్ అనే యువకుడు మృతి చెందాడు. పెటేరు గ్రామంలో రాతి గోడ కూలి... మరో యువకుడు మృతి చెందాడు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో గాలి, వాన ధాటికి అరటి, పసుపు, మొక్కజొన్న, జామ పంట పూర్తిగా దెబ్బతిన్నాయి. అరటి చెట్లు విరిగి నేలకొరిగాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం వి.అగ్రహారం గ్రామంలో బలమైన ఈదురు గాలుల ధాటికి 200 వందల వక్కచెట్లు నేలకొరిగాయి.

ఉత్తరాంధ్ర పై ప్రభావం - అలర్ట్
భారీ వర్షాలకు అనకాపల్లి జీల్లా నర్సీపట్నంలో రహదారులు జలమయాయ్యాయి. కాలనీలు నీటి ముంపునకు గురయ్యాయి. రోలుగుంట, రావికమతం మండలాల్లో భారీ వర్షం కురిసింది. తుపాను ప్రభావంతో మే 10వ తేదీన ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. మే 11వ తేదీన కూడా ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో ఇదే తరహా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. తుపాను బలపడి తీవ్ర తుపానుగా మారిన నేపథ్యంలో తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అసని ఈ నెల 12వ తేదీ నాటికి వాయుగుండంగా బలహీనపడుతుందని, అప్పటివరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తాజా బులెటిన్ లో హెచ్చరించింది.












Click it and Unblock the Notifications