విధ్వంస పరిపాలన-ఆందోళనకర పరిస్థితుల్లో ఏపీ : వైసీపీ పాలనపై పురంధేశ్వరి...!!
ఏపీలో వైసీపీ పాలన పైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ఆందోళన కర పరిస్థితుల్లో ఉందని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటికి 2లక్షల50 వేల కోట్లు అప్పు చేశారన్నారు. ఇప్పుడది 6లక్షల కోట్లు దాటిందంటే ఎంతటి ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్రం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేసి మోయలేని భారాన్ని ప్రజలపై వేస్తోందన్నారు పురంధేశ్వరి.
రాష్ట్రంలో పెట్టుబడులతో కొత్తగా పరిశ్రమలు పెట్టే పరిస్థితులే లేవన్నారు. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవని చెప్పారు. ఉద్యోగాలు లేవన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా విధ్వంసాలు.. విద్వేషాలను రెచ్చగొట్టేలా వైసీపీ పాలన సాగుతోందంటూ ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చడంతో విధ్వంస పరిపాలనకి నాంది పలికారన్నారు. రాష్ట్రంలో గుళ్ళు గోపురాలు, మూల విరాట్టులను సైతం ధ్వంసం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే వెంటనే ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ఆర్దిక పరిస్థితి పైన ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా టీడీపీ నేతలు..జనసేన అధినేత సైతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి విమర్శలు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం తాము చేస్తున్న అప్పుల గురించి సమర్ధించుకుంటున్నారు. కరోనా సమయంలో ఆర్దికంగా ఏర్పడిన సమస్యలు..సంక్షేమం కోసం చేస్తున్న ఖర్చు గురించి చెబుతున్నారు.
Recommended Video
ఇదే సమయంలో ప్రపంచం మొత్తం అప్పులు చేస్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు. అయితే, రాష్ట్రంలో సంక్షేమం పేరుతో చేస్తున్న ఖర్చు పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక, ఇప్పటి వరకు బీజేపీ - జనసేన నేతలకే పరిమితమైన ఈ రకమైన ఆరోపణలను ఇప్పుడు బీజేపీ ముఖ్య నేతలు సైతం మొదలు పెట్టటంతో వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా సమాధానం చెబుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications