రేపు రాత్రి తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం! భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంటగంటకూ బలపడుతూ తీరప్రాంత జిల్లాలను వణకిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం వేగంగా కదులుతోంది. గత కొన్ని గంటలుగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ తీవ్రరూపం దాలుస్తోంది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 320 కిలోమీటర్లు, కళింగపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉనట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
రాబోయే 12 గంటల్లో ఈ వాయుగుండం మరింత బలపడి 'తీవ్ర వాయుగుండం' (డీప్ డిప్రెషన్)గా మారేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అదే వేగంతో ప్రయాణిస్తూ సెప్టెంబర్ 23 రాత్రి నుంచి 24 తెల్లవారుజాము మధ్య విశాఖపట్నం-గోపాల్పూర్ (ఒడిశా) మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో, ఈదురుగాలులు గంటకు 75 కిలోమీటర్ల వరకు వీచే ప్రమాదం ఉండటంతో తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
వాయుగుండం ఎఫెక్ట్‌తో ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిశా జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే రెండు మూడు రోజులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడా కుండపోత వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు యంత్రాంగాన్ని సిద్ధం చేశారు.
సముద్రం తీవ్ర అలజడిగా మారి రాకాసి అలలు ఎగిసిపడుతుండటంతో మత్స్యకారులను సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని కఠినంగా ఆదేశించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారిని వెంటనే ఒడ్డుకు తిరిగిరావాలని సూచించారు. తీరప్రాంత ప్రజలు, ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో ఉన్నవారు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు అప్రమత్తత జారీ చేశారు.














Click it and Unblock the Notifications
