చంద్రబాబుపై పెల్లుబికిన అభిమానం .. కృష్ణానదిలో పడవలతో ర్యాలీ, భారీవస్త్రంపై చంద్రబాబు చిత్రం పెయింటింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఐదేళ్ల వైసిపి పాలనకు ముగింపు పడి నవ్యాంధ్ర సారధిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వేళ ప్రజలు చంద్రబాబు పట్ల తమకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకుంటున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది.
చంద్రబాబుపై అమరావతి ఇసుక పడవల యజమానుల అభిమానం
దాదాపు లక్ష మంది సభా ప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో జయజయ ధ్వానాలు చేశారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వేళ అమరావతిలోని ఇసుక పడవల యజమానులు వినూత్నంగా చంద్రబాబుకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

ముప్పై పడవలతో ర్యాలీ
కృష్ణా నదిలో సుమారు 30 పడవలతో తుళ్లూరు మండలం వెంకట పాలెం నుండి, ప్రకాశం బ్యారేజీ వరకు ర్యాలీ నిర్వహించి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ జండాలను కట్టి జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో సందడి చేశారు. చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం కావడంతో మళ్లీ తమకు ఉపాధి లభిస్తుందని వారు సంతోషంతో ర్యాలీ చేశారు.
భారీవస్త్రంపై చంద్రబాబు పెయింటింగ్ .. కుప్పం వ్యక్తి అభిమానం
ఇదిలా ఉంటే చంద్రబాబు పైన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ప్రమాణ స్వీకారం రోజు చిత్తూరు జిల్లా కుప్పం కు చెందిన ఓ అభిమాని చంద్రబాబుపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని తన ఆర్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన అభిమాని భారీ వస్త్రంపై చంద్రబాబు నాయుడు చిత్రాన్ని పెయింటింగ్ వేసి ప్రదర్శించారు.
సుదీర్ఘ నిరీక్షణ ఫలించిన వేళ పెల్లుబికిన అభిమానం
ఇక దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని తిలకించి సంతోషం వ్యక్తం చేయగా, పలువురు అభిమానులు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని స్పష్టం చేస్తున్నారు. సుదీర్ఘ నిరీక్షణ ఫలించినట్టు వారు తమ అభిమాన సీఎంకు జేజేలు పలుకుతున్నారు.












Click it and Unblock the Notifications