బాబుకు తలనొప్పి: రాజధానిగా కర్నూలు కోసం పొలికేక
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. విజయవాడ - గుంటూరు మధ్యన లేదా దొనకొండలో రాజధానిని ఏర్పాటు చేసుకోవాలనే చంద్రబాబుకు రాయలసీమ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాజయలసీమలో ఈ డిమాండ్‌తో ఆందోళనలు పెరిగాయి.
తాజాగా, సోమవారంనాడు ఆంధ్ర ప్రదేశ్‌కు కర్నూలును రాజధాని చేయాలంటూ రాయలసీమ రాజదాని సాధన సమితి లక్షమందితో పొలికేక కార్యక్రమం చేపట్టింది. సోమవారం ఉదయం సమతి ఆధ్వర్యంలో పాతబస్టాండ్ తెలుగు తల్లి విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రంలో భారీగా ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా ఆగస్టు 15వ తేదీన కర్నూలులో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించి కర్నూలును రాజధానిగా చేయాలనే డిమాండ్‌తో ఈ సభ జరిగే అవకాశం ఉంది.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపికపై ఈ నెలాఖరులోగా కేంద్రానికి నివేదిక అందజేస్తామని శివరామకృష్ణన్ కమిటీ వెల్లడించింది. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటుకు సిఫారసు చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. రాజధానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయడం కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీలో సభ్యులైన ఆరోవర్ రవి, తిమ్మారెడ్డి, టి. రవీంద్రన్ ఆదివారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు.
రాజధాని ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించారు. ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో అభిప్రాయ సేకరణ జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. అందుకోసం అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజధాని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండాలని, దాని ద్వారా చుట్టుపక్కల ఉన్న చిన్న నగరాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పారు.












Click it and Unblock the Notifications