ఢిల్లీలో కీలక ప్రకటన చేసిన పవన్..!!
Pawan Kalyan: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో భాగస్వామిగా ఉంటోన్న జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ప్రస్తుతం హస్తిన పర్యటనలో ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై కేంద్రమంత్రులను కలుసుకుంటోన్నారు.
ఈ క్రమంలో కేంద్ర పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌తో భేటీ అయ్యారాయన. రాష్ట్రాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై చర్చించారు. వాటికి సంబంధించిన వివరాలను అందజేశారు. సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఏపీలో టూరిజాన్ని అభివృద్ధి చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.

ఏపీ పర్యాటక మంత్రిత్వ శాఖ.. జనసేన ఆధీనంలోనే ఉంది. ఆ పార్టీకి చెందిన శాసన సభ్యుడు కందుల దుర్గేష్ ఈ శాఖను పర్యవేక్షిస్తోనన్నారు. ఈ నేపథ్యంలో- ఈ శాఖ అభివృద్ధిపై పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టయింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తోన్నారు.
కేంద్రమంత్రితో భేటీ సందర్భంగా పవన్ విలేకరులతో మాట్లాడారు. ఏపీని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని, దీనికి అవసరమైన సహాయ సహకారాలను అందించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఈ రంగానికి చెందిన పలు కీలక ప్రాజెక్టులను అమలు చేయాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.

ఏపీకి 975 కిలో మీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, దీన్ని పర్యాటక రంగాభివృద్ధి కోసం వినియోగించుకోవడానికి గల అవకాశాలను కేంద్రమంత్రికి వివరించినట్లు పవన్ చెప్పారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించుకోవడంతో పాటు తీర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయవచ్చని అన్నారు.
కడప జిల్లాలో గల గండికోట వంటి వారసత్వ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. అలాగే- రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని కోరినట్లు పవన్ చెప్పారు. వాటన్నింటికీ గజేంద్ర సింగ్ షెఖావత్ సానుకూలంగా స్పందించారని, బడ్జెట్‌లో ఎలాంటి సర్దుబాట్లు చేయాలనే విషయం కసరత్తు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు.












Click it and Unblock the Notifications