ఎంపీడీవో అదృశ్యంపై పవన్ కళ్యాణ్ సీరియస్
నరసాపురం ఎంపీడీవో ఎం వెంకటరమణరావు అదృశ్యంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్‌గా స్పందించారు. ఎంపీడీవో వెంకటరమణరావు అదృశ్యం, అందుకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన ఆదేశించారు. అదృశ్యమైన అధికారి ఆచూకీ కనిపెట్టే చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
వెంకటరమణరావు రాసిన లేఖ, అందులోని వివరాలపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఫెర్రీ కాంట్రాక్టర్ బకాయిల అంశాన్ని లేఖలో ప్రస్తావించిన విషయాన్ని అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఫెర్రీ బకాయిల వివరాలు, ఈ విధంగా బకాయిలు పెడుతున్న వారి వివరాలను తక్షణమే అందించాలన్నారు. ఒక అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైనవారిపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణరావు కనిపించకుండా పోయారంటూ ఆయన భార్య కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో చేశారు. కానూరు మహదేవపురం కాలనీలో ఎంపీడీవో వెంకటరమణరావు దంపతులు నివాసం ఉంటుండగా.. సెలవు రోజుల్లో ఇంటికి వచ్చేవారు.
సోమవారం ఉదయం మంచిలీపట్నం వెళుతున్నానని చెప్పి వెళ్లిపోయిన వెంకటరమణరావు.. ఎంతకీ తిరిగిరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది ఇలావుంటే, ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా కుటుంబసభ్యులకు వెంకటరమణరావు నుంచి వాట్వాప్ ద్వారా సూసైడ్ నోట్ రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మాజీ విప్ ప్రసాదరాజు ఇబ్బంది పెడుతున్నారని, బోటింగ్ కాంట్రాక్టర్ 55 లక్షల రూపాయలు బకాయిలు కట్టమంటే.. బెదిరిస్తున్నాడని.. అందుకే సూసైడ్ చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో వెంకటరమణరావు పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి నుంచి ఏలూరు కాల్వలో వెంకటరమణరావు మృతదేహం కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. మరోవైపు, ఎంపీడీవో మొబైల్ ఫోన్ ట్రాక్ చేయగా.. విజయవాడ మధురానగర్ రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. పక్కనే ఉన్న ఏలూరు కాల్వలో దూకి ఎంపీడీవో ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications