ప్రకాశంలో ఒకరిని మించి ఒకరు బలమైన నేతలు: అయినా దర్శిలో చుక్కెదురు: వైసీపీ స్కానింగ్ రిపోర్ట్
ఒంగోలు: మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు హైరేంజ్‌లో కొనసాగింది. వైఎస్ఆర్సీపీ జైత్రయాత్ర ఏ స్థాయిలో కొనసాగిందంటే.. చివరికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కంచుకోట.. చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పం సైతం తుత్తునీయలు అయింది. వైఎస్ఆర్సీపీ ధాటికి నిలవలేకపోయింది..దాసోహమైంది. 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు నిర్వహించిన ఎన్నికల్లో అధికార పార్టీ హవా స్పష్టంగా కనిపించింది.

దర్శిలో అడ్డుకట్ట..
ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీ పరిధిలో వైసీపీకి చుక్కెదురైంది. ఈ మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అధికార పార్టీకే చెందిన శాసన సభ్యుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ- దర్శిలో నిరాశే ఎదురైంది. మొత్తం 20 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో 13 చోట్ల తెలుగుదేశం అభ్యర్థులు గెలిచారు. ఏడింటిని మాత్రమే వైసీపీ సొంతం చేసుకోగలిగింది. కనీసం గట్టిపోటీ కూడా ఇవ్వలేకపోయిందనేది ఈ సంఖ్యను బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు.

ప్రకాశంలో వైసీపీ బలమైన నాయకత్వం ఉన్నా..
ప్రకాశం జిల్లాలో వైఎఎస్ఆర్సీపీకి బలమైన నాయకత్వం ఉంది. నాయకత్వ లోటు అనేది లేదు. ఇద్దరు మంత్రులు ఈ జిల్లాకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. ప్రకాశం జిల్లాకు చెందిన వారే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ జిల్లాకు చెందిన నాయకుడే.

టీడీపీ నుంచి వచ్చిన వారికీ కొదువ లేదు..
తెలుగుదేశం నుంచి పార్టీ ఫిరాయించి వైసీపీలో చేరిన నాయకులకు కూడా కొదువ లేదు ఈ జిల్లాలో. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కరణం బలరామకృష్ణమూర్తి, వైశ్య సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు.. టీడీపీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా వేసుకున్నారు. జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడిన ఆమంచి కృష్ణ మోహన్ వైసీపీలో కొనసాగుతుండటం అదనపు బలం.

ఇంతమంది ఉన్నా..
ఇంతమంది నాయకులు ఉన్నప్పటికీ.. దర్శి నియోజకవర్గాన్ని టీడీపీ దక్కించుకోవడం పట్ల వైసీపీని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓటమిపాలు కావడానికి గల కారణాల గురించి అన్వేషిస్తోంది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌పైనే అందరి దృష్టీ నిలిచింది. ఆయన పనితీరుకు మున్సిపల్ ఎన్నిక ఫలితం గీటురాయిగా భావిస్తున్నారు నాయకులు. దర్శి పట్టణంలో మద్దిశెట్టిపై ఉన్న అసంతృప్తిని ఓటర్లు ఈ రూపంలో స్పష్టం చేశారని అంటున్నారు.

అంతర్గత పోరు..
దర్శి నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయనే ప్రచారం చాలా రోజుల నుంచీ ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మద్దిశెట్టికి టికెట్ ఇవ్వడాన్ని బూచేపల్లి శివప్రసాద్ వర్గీయులు గట్టిగా వ్యతిరేకించారు. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి వైరం ఉందనే విషయం బహిరంగ రహస్యమే. ఈ ఇద్దరు నేతల మధ్య సమన్వయ లోపం కొంపముంచిందని పార్టీ నాయకులు అనుమానిస్తున్నారు. వైఎస్ జగన్ ఛరిష్మా కూడా ఇక్కడ పని చేయకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

టీడీపీ బలంగానే..
ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనే విషయాన్ని దర్శి మున్సిపల్ ఎన్నిక మరోసారి స్పష్టం చేసినట్టయింది. 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు గెలుచుకోగలిగింది. విశాఖపట్నం తరువాత అత్యధిక ఎమ్మెల్యేలను టీడీపీకి అందించిన జిల్లా ఇది. పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, చీరాల నుంచి కరణం బలరామకృష్ణమూర్తి, కొండెపి నుంచి డోలా బాలవీరాంజనేయ స్వామి గెలుపొందారు. తదనంతరం కరణం బలరాం పార్టీ ఫిరాయించారు. వైసీపీలో చేరారు.












Click it and Unblock the Notifications