తిరుమల, తిరుపతి యాత్రికుల వసతి సముదాయాల్లో ఇకపై..
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 63,473 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 27,796 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.54 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 22 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై విభాగాలవారిగా అధికారులతో టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు.
తిరుపతిలో ఎస్ఎస్‌డీ కౌంటర్ల నిర్వహణ, అన్నప్రసాదం విభాగం ఆధునికీకరణ, పరకామణి నిర్వహణ, పారిశుద్ధ్యం, టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా బాలాజీ నగర్ గృహాల పరిశీలన, కాలిబాట మార్గాలలోని దుకాణాల తనిఖీలు, యాత్రికుల వసతి సముదాయాల్లో కేంద్రీకృత లాకర్ కేటాయింపు వ్యవస్థల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
యాత్రికుల వసతి సముదాయాల్లో లాకర్ కేటాయింపును ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని, దీనికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అన్నారు. సెంట్రల్ లాకర్ వ్యవస్థలో లోపాలు తలెత్తకుండా చూడాలని చెప్పారు.
ఎఫ్ఎంఎస్ మొబైల్ యాప్ వినియోగం, తిరుమలలో ల్యాండ్‌స్కేప్ సర్వే, కొత్తగా రూపొందిస్తున్న కాటేజ్ డొనేషన్ పాలసీ, సీఆర్వో పునర్నిర్మాణం వంటి అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి నిర్దేశిత సమయంలోపు తమకు కేటాయించిన పనులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఎల్ అండ్ టీ ప్రతినిధులతో భేటీ..
అనంతరం శ్యామలరావు, సీహెచ్ వెంకయ్య చౌదరి.. భక్తుల సౌకర్యార్థం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతా ప్రణాళికలపై ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక భద్రతా సదుపాయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఇందులో భాగంగా అలిపిరి తనిఖీ కేంద్రం ఆధునీకరణ, అధిక సామర్థ్యం కలిగిన స్కానర్లు, త్వరితగతిన తనిఖీలు పూర్తయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పార్కింగ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ కంట్రోల్, ఇంటిగ్రాటెడ్ సర్వేలన్స్ సిస్టం, కామన్ అలారం మానేజ్మెంట్ సిస్టం, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ, నో హెల్మెట్ డిటెక్షన్, ఆటోమెటిక్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ క్లారిఫికేషన్, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ వంటి అంశాలను ఈవోకు వివరించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 40 ఏళ్లకు సరిపడా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. అదే విధంగా దీర్ఘ కాలిక, స్వల్ప కాలిక ప్రణాళికలు రూపొందించాలని ఎల్ అండ్ టీ ప్రతినిధులను కోరారు.












Click it and Unblock the Notifications