'ఆ మాట అంటే కోపం, దివిస్ ఫార్మా నుంచి ముడుపులు డిమాండ్ చేసిన జగన్'
జగన్ తేలు కుట్టిన దొంగ అని, ఇడుపులపాయ ఎస్టేట్ బంకర్స్‌లో ఉన్న వేల కోట్లను ఎలా బయటకు తేవాలో తెలియక జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.
విజయవాడ: పెద్ద నోట్ల రద్దు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ముందే తెలుసునని, అందుకే హెరిటేజ్ షేర్లు విక్రయించి జాగ్రత్త పడ్డారన్న వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.
నోట్ల రద్దు మొత్తానికి ఏపీలో అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. తాజాగా, బుధవారం జగన్ చేసిన వ్యాఖ్యలపై దేవినేని స్పందించారు. జగన్ తేలు కుట్టిన దొంగ అని మండిపడ్డారు. ఇడుపులపాయ ఎస్టేట్ బంకర్స్‌లో ఉన్న వేల కోట్లను ఎలా బయటకు తేవాలో తెలియక జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

జగన్ ఓ ఉన్మాది అని, కానీ ఈ మాట అంటే ఆయనకు కోపం అన్నారు. జగన్ పరిశ్రమలను అడ్డుకోవడానికి సభలు పెడుతున్నారన్నారు. నోట్ల రద్దుతో ప్రజలు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే, వైయస్ జగన్ అంత ఖర్చు పెట్టి సభలు ఎలా పెడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు.
చంద్రబాబు అండ చూసుకొని దివిస్ సంస్థ మొండిగా ముందుకు వెళ్తే సమస్యలు తప్పవని జగన్ చెప్పడం విడ్డూరమన్నారు. దివిస్ పరిశ్రమను ఎందుకు అడ్డుకుంటున్నారో జగన్ చెప్పాలన్నారు. దివిస్ ఫార్మా నుంచి జగన్ ముడుపులు డిమాండ్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
రాంకీ ఫార్మా ముందు ఎందుకు ధర్నా చేయరని జగన్‌ను నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా జగన్ అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. జగన్ ఇద్దరు ఆంబోదులను వదిలి చంద్రబాబు కుటుంబం పైన, హెరిటేజ్ పైన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications