Pawan Kalyan Health Bulletin: పవన్ హెల్త్ బులిటెన్ రిలీజ్..! కోలుకునేది అప్పుడే..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు తాజాగా ముంబైలోని కోకిలా బెన్ ధీరూబాయి అంబానీ ఆస్పత్రిలో కుడి భుజంలో రొటేటర్ కఫ్ గాయం నిర్ధారించారు. దీంతో ఆయనకు శస్త్రచికిత్స కూడా నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కూడా పవన్ ను పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే కోకిలా బెన్ ఆస్పత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్ధితిని వివరిస్తూ హెల్త్ బులిటెన్ (Health Bulletin) విడుదల చేసింది.
ఇందులో పవన్ కళ్యాణ్ కు కుడి భుజంలోని రోటేటర్ కఫ్ భాగంలో తీవ్ర గాయం నిర్ధారణ అయిందని, ఈ గాయంలో సుప్రాస్పినేటస్ , ఇన్‌ఫ్రాస్పినేటస్ టెండన్లు తీవ్రంగా చిరిగిపోవడంతో పాటు, భుజంలోని గ్రేటర్ ట్యూబెరోసిటీ ఎముకలో అవల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారని తెలిపింది. ఈ గాయానికి సంబంధించి నిన్న తమ ఆసుపత్రిలో ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని తెలిపింది.

ఈ శస్త్రచికిత్సను ఆసుపత్రి ఆర్థ్రోస్కోపీ & షోల్డర్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ దిన్‌షా పర్డీవాలా నిర్వహించారని వెల్లడించింది. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆయన చికిత్సకు మంచి స్పందనతో కోలుకుంటున్నారని పేర్కొన్నారు. విశ్రాంతి తర్వాత ఆయనకు భుజం పునరుద్ధరణ కోసం ప్రత్యేక ఫిజియోథెరపీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాబోయే నాలుగు నెలల్లో భుజం పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం ఉందని కోకిలా బెన్ ఆస్పత్రి వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications