హార్ముజ్ క్లోజ్: ఇరాన్ కొత్త రూల్! యూఎస్ స్ట్రాంగ్ కౌంటర్
ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) పై పట్టు కోసం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదిరిన వివాదం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ వ్యూహాత్మక జలసంధిని తాము మూసివేశామని ఇరాన్ ప్రకటించగా.. లేదు, అక్కడ షిప్పుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయంటూ అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తిప్పికొట్టింది. ఈ అంతర్జాతీయ జలమార్గంపై ఇరాన్ హుకూం చెల్లదంటూ అమెరికా చేసిన ప్రకటనపై టెహ్రాన్ తీవ్రంగా మండిపడింది. హార్ముజ్ జలసంధి గుండా రవాణా నియంత్రణ పూర్తిగా తమ చేతుల్లోనే ఉందంటూ ఇరాన్ స్పష్టం చేసింది.
పర్మిషన్ ఉంటేనే ఎంట్రీ.. ఇరాన్ కొత్త రూల్!
ఇరాన్‌కు చెందిన అధికారిక సముద్ర రవాణా సంస్థ 'పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ' (PGSA) సోషల్ మీడియా వేదికగా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రాంతంలో అమెరికా సైనిక దళాల 'అక్రమ కదలికల' కారణంగానే హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణాన్ని ప్రస్తుతానికి నిలిపివేసినట్లు పేర్కొంది. ఒకవేళ ఏవైనా నౌకలు ఈ మార్గంలో ప్రయాణించాలంటే తాము జారీ చేసే ప్రత్యేక 'ట్రాన్సిట్ పర్మిట్' తప్పనిసరి అని స్పష్టం చేసింది. ప్రాంతంలో శాంతి, స్థిరత్వం ఏర్పడిన వెంటనే దరఖాస్తులను పరిశీలించి షెడ్యూల్ ప్రకారం అనుమతులు ఇస్తామని, పర్మిషన్ కోసం తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పీజీఎస్ఏ (PGSA) నిబంధనలు విధించింది.

ఇరాన్ కంట్రోల్‌లో జలసంధి లేదు.. అమెరికా కౌంటర్!
ఇరాన్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) గట్టి కౌంటర్ ఇచ్చింది. హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ చట్టాల ప్రకారం నడిచే జలమార్గమని, ఇది అన్ని దేశాల నౌకల ప్రయాణానికి తెరిచే ఉందని స్పష్టం చేసింది. "ఇరాన్ అనవసరమైన దురాక్రమణలు, బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ.. అంతర్జాతీయ నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణాన్ని కాపాడటానికి అమెరికా దళాలు పూర్తి సన్నద్ధతతో రంగంలో ఉన్నాయి. ఈ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదు, అక్కడ ట్రాఫిక్ సాధారణంగానే సాగుతోంది" అంటూ అమెరికా సైన్యం ఇరాన్ వాదనలను కొట్టిపారేసింది.
అమెరికా తోకముడిచే వరకు ఇంతే: ఐఆర్జీసీ హెచ్చరిక
అంతకుముందు, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పశ్చిమ ఆసియా ప్రాంతంలో అమెరికా తన 'జోక్యాన్ని' పూర్తిగా ముగించే వరకు హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రెస్ టీవీ ద్వారా ప్రకటించింది. విదేశీ శక్తుల అక్రమ జోక్యం వల్ల ఏర్పడిన భద్రతా కారణాల దృష్ట్యా ఏ నౌకనూ అనుమతించేది లేదని ఐఆర్జీసీ (IRGC) స్పష్టం చేసింది. జలసంధి మూసివేతను సాకుగా చూపి ఇరాన్‌పై ఎలాంటి సైనిక చర్యలకు దిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ప్రతీకార దాడులు ఉంటాయని హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతల నడుమ, అమెరికా-ఇరాన్ చర్చల పునరుద్ధరణకు అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు ఖతార్ దేశ రాయబారులు టెహ్రాన్‌లో రాయబారాలు నడుపుతున్నారు.












Click it and Unblock the Notifications