చంద్రబాబు రాజీనామా చేయాల్సిందే: దేవినేని నెహ్రూ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడంలో విఫలమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అమరావతి శంకుస్థాపనకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలా ఉందని ఆయన విమర్శించారు. శంకుస్థాపనకు కోట్ల రూపాయలు ఖర్చుచేసినా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడం బాధాకరమని దేవినేని నెహ్రూ అన్నారు.

రాజధాని శంకుస్థాపన కోసం వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయడం అన్యాయమని కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. నరేంద్ర మోడీ వరాలిస్తారనే ప్రచారంతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టించిన చంద్రబాబు సమాధానం చెప్పితీరాలని ఆమె డిమాండ్ చేశారు. విజయవాడ స్థానిక సెంటర్‌లో మోడీ, చంద్రబాబు దిష్టి బొమ్మలను తగులబెట్టారు.












Click it and Unblock the Notifications