సాక్షిలో తప్పుడు ప్రచారం!.. పోలవరం పూర్తి చేసి తీరుతాం: జగన్‌పై దేవినేని
సాక్షిలో ఎన్ని తప్పుడు వార్తలు రాసినా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి తీరుతామని దేవినేని అన్నారు.
విజయవాడ: పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఎంత విషం చిమ్మినా చరిత్ర హీనుడు గానే మిగిలిపోతారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం పూర్తయితే వైసీపీకి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టుపై మంగళవారం నాడు దేవినేని మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కింద భూమి కోల్పోతున్న నిర్వాసితులకు భూమికి భూమి ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1981 కోట్లు చెక్కు రూపంలో అందిందన్నారు.

2018 చివరికల్లా పోలవరం ప్రాజెక్టును ఎలాగైన పూర్తి చేయాలన్న సంకల్పంతో తామున్నామని, సాక్షి పత్రికలో దీనిపై ఇష్టం వచ్చినట్టు రాసి విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. పోలవరాన్ని అడ్డుకోవడం కోసం జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో వట్టిసీమపై కుట్రలు చేసిన వైసీపీ పక్క రాష్ట్రాల వాళ్లను కూడా రెచ్చగొట్టిందని అన్నారు.
సాక్షిలో ఎన్ని తప్పుడు వార్తలు రాసినా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి తీరుతామని దేవినేని అన్నారు. జగన్ ఏమి మాట్లాడిన ప్రజలు నమ్ముతారనే భ్రమలో అసత్యాల్ని ప్రచారం చేస్తున్నారని ఈ సందర్బంగా దేవినేని ఆరోపించారు.












Click it and Unblock the Notifications