తిరుమల లడ్డూ, ఇప్పుడు కాణిపాకం, శ్రీకాళహస్తికి ప్రైవేట్ డైరీల నెయ్యి.... !!
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారి కోసం కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రసాదాల కోసం వినియోగిస్తున్న నెయ్యి, ఆహార సరుకుల నాణ్యతపై భక్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద పుణ్యక్షేత్రాలు అయిన శ్రీకాళహస్తి, కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయాల్లో లడ్డు ప్రసాదాల విషయంలో భక్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో తయారు చేస్తున్న ప్రసాదాలు కోసం వినియోగిస్తున్న నెయ్యి, ఆహార పదార్థాలను తనిఖీ చేయాలని సంబంధిత అధికారులకు స్వామివారి భక్తులు మనవి చేస్తున్నారు.

2018 నుండి కాణిపాకం ఆలయానికి ప్రైవేట్ డైరీ నుంచి నెయ్యి సేకరిస్తున్నారు. అంతకు ముందు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నుంచి నందిని నెయ్యిని కొనుగోలు చేసేవారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో నందిని నెయ్యి సరఫరాను నిలిపివేశారు. కాణిపాకం, శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాలకు రెండు ప్రైవేట్ డైరీల నుంచి నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. అలాగే తిరుపతికి చెందిన ఓ సంస్థ నుంచి సరుకులు కొంటున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో కాణిపాకంలో ప్రసాదాలు తయారుచేయడానికి సరఫరా అవుతున్న సరుకుల విషయాన్ని అప్పటి వైసీపీ ప్రభుత్వం, కాణిపాకం అధికారులు చాలా సీక్రెట్ గా పెట్టారని భక్తులు ఆరోపిస్తున్నారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్న వైష్ణవి సంస్థ నుంచి కాణిపాకం ఆలయానికి కిలో నెయ్యి రూ. 555 చొప్పున ప్రతినెల మూడు వేల కిలోల నెయ్యి కొనుగోలు చేశారు.
ప్రభుత్వ డైరీలను పక్కనపెట్టి ప్రైవేట్ డైరీల నుంచి నెయ్యి కొనుగోలు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారులు ఆసక్తి చూపడం ఇప్పుడు అనుమానాలకు దారి తీస్తోందని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారి కోసం కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడడంతో ఇప్పుడు శ్రీకాళహస్తి, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి భక్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కానీ వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి నుండి వచ్చిన సరుకులను ఏ ఒక్క అధికారి పరిశీలించలేదని కాణిపాకం భక్తులు ఆరోపిస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగు చూడటంతో పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా కాణిపాకం చేరుకొని దేవాలయానికి చెందిన గోడౌన్ లో నిల్వచేసిన ఆహార పదార్థాలు, సరుకులు, పరిశీలించారు.
కాణిపాకం ప్రసాదానికి ఉపయోగించే ఈ ఆహార పదార్థాలను, ప్రసాదాల తయారి కోసం ఉపయోగించే నెయ్యిని సేకరించి వాటిని పరిశీలించడానికి సంబంధిత లేబరేటరీకి పంపించాలని టీడీపీ ఎమ్మెల్యే కలికిరి మురళిమోహన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు రావడంతో ఇప్పుడు శ్రీకాళహస్తి కాణిపాకం ఆలయాలకు వచ్చి వెళ్లే భక్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications