పాకిస్తాన్ దురాగతానికి 29 మంది బలి: హెచ్చరికలు పంపిన తాలిబన్లు
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. సరిహద్దు వెంబడి తీవ్రవాద స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం జరిపిన కీలకమైన భూతల ఆపరేషన్, వైమానిక దాడుల్లో 29 మంది హతం అయ్యారు. ఈ విషయాన్ని పాక్ అధికారిక వర్గాలు ధృవీకరించాయి. దేశంలో ఇటీవల కాలంలో వివిధ నగరాల్లో పెరిగిన తీవ్రవాద దాడులకు దీటుగా బదులు చెప్పేందుకే ఈ సైనిక చర్యలు చేపట్టినట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ వెల్లడించారు.
కరాచీ పారామిలటరీ రేంజర్స్ ప్రాంతీయ కార్యాలయం, సింధ్ రేంజర్స్ ప్రావిన్షియల్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన భారీ దాడికి ప్రతీకారంగానే ఈ తాజా సైనిక చర్య చోటుచేసుకుంది. గులిస్తాన్ ఎ జౌహర్ ప్రాంతంలో ఉన్న ఆయా ప్రధాన కార్యాలయాలపై ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పారామిలిటరీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు తీవ్రవాదులను పాకిస్తాన్ భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపాయి. తీవ్ర గాయాలతో పట్టుబడిన ఓ ఉగ్రవాదిని ఆఫ్ఘన్ జాతీయుడిగా పాక్ సైనిక వర్గాలు గుర్తించడం సంచలనం సృష్టించింది. ఈ దాడికి పాకిస్తానీ తాలిబాన్ (టీటీపీ) నుంచి విడిపోయిన జమత్ ఉల్ అహ్రార్ అనే తీవ్రవాద అనుబంధ సంస్థ బాధ్యత వహించింది. పాకిస్తాన్ పై ప్రతీకారాన్ని తీర్చుకునే క్రమంలో ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించుకుంది.
ఈ నేపథ్యంలోనే పాక్ సైన్యం ఆదివారం సరిహద్దు దాటి తాలిబాన్ అనుబంధ గ్రూపుల సురక్షిత స్థావరాలపై విరుచుకుపడింది. ఈ ఆపరేషన్‌లో తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్ శ్రేణులే ప్రధాన లక్ష్యంగా మారాయని మంత్రి అతావుల్లా స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలో ఉన్న తాలిబాన్, ఈ టీటీపీ రెండు వేర్వేరు సంస్థలైనప్పటికీ, పరస్పరం సహకారం అందించుకుంటాయని ఆరోపించారు. ముందు కూడా దాడులు తప్పవని స్పష్టం చేవఆరు.
ఈ సైనిక చర్యను తాలిబన్ ప్రభుత్వం తప్పు పట్టింది. ఘాటుగా స్పందించింది. పాకిస్తాన్ అనాలోచిత చర్యల వల్ల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అఫ్ఘనిస్తాన్ తూర్పు ప్రాంతంలోని పక్తికా, పక్తియా, కునార్ వంటి కీలక సరిహద్దు ప్రావిన్సులపై పాక్ జరిపిన ఈ వైమానిక దాడులు అంతర్జాతీయ నియమ నిబంధనలకు విరుద్ధమని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనావాసాలను లక్ష్యంగా చేసుకొని జరిపిన ఈ దాడులను అత్యంత పిరికిపంద చర్యగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications