సమ్మర్ లో తిరుమలకు వెళ్లే భక్తుల కోసం..
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళ నాడు 27,682 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 9,985 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.46 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నాలుగు కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది.
వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ చర్యలు చేపట్టింది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికలను రూపొందించుకుంటోంది. దీనిపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి ఇదివరకే సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు- మూడు సంవత్సరాల వేసవి డేటాను పరిగణనలోకి తీసుకుని భక్తుల సంఖ్య, వేచి ఉండే సమయం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి అన్నప్రసాదం, మంచినీటి పంపిణీ, నడక దారి భక్తులకు మార్గమధ్యలో షెడ్ల ఏర్పాటు, మాడ వీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్ వేయాలని నిర్ణయించారు. అలాగే మజ్జిగ పంపిణీ పాయింట్ల సంఖ్యను పెంచి వేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. వసతి సదుపాయాలు, అన్నప్రసాదం నిర్వహణను మరింత సమర్థంగా అమలు చేయనున్నారు. నడకదారి భక్తులు, అధిక రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తోన్నారు.
వేసవిలో కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, వారికి వీలైనంత త్వరగా దర్శనం కలిగేలా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించారు టీటీడీ అధికారులు. ఈసారి ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచి, కంపార్ట్ మెంట్లల్లో రద్దీ, గంటల వారీగా ఇన్- అవుట్ ఫ్లో, వేచి ఉండే సమయాన్ని ప్రతి నిమిషం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
గత వేసవిలో జూన్ లో టీటీడీ అధికారులు సగటున రోజుకు 80 వేల నుంచి 82 వేల మందికి దర్శనం కల్పించారు. సమర్థవంతమైన టైమ్ మేనేజ్‌మెంట్, అన్ని విభాగాల సమన్వయంతో సాధ్యమైందని చెబుతున్నారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో భక్తులకు మెరుగైన సౌకర్యాలతో కూడిన దర్శన భాగ్యాన్ని కల్పించడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తోన్నారు. వేసవిలో భక్తులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో కార్యరంగంలోకి దిగాయి.












Click it and Unblock the Notifications