ఓం నమః శివాయ - భక్తులతో పోటెత్తుతున్న శివాలయాలు..!!
పంచాక్షరీ మంత్రంతో శివాలయాలు మార్మోగుతున్నాయి.
పంచాక్షరీ మంత్ర పఠనంతో శివాలయాలు మార్మోగుతున్నాయి. శివరాత్రి నాడు పరమేశ్వరుడి దర్శనం కోసం ప్రముఖ శైవ క్షేత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ముస్తాబయ్యాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఏపీలోని శ్రీశైలం మహాక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. నేటి రాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తిలోనూ భక్తులు భారీగా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ దేవాలయంలో భక్తులు పోటెత్తారు. ప్రముఖ ఆలయాల్లో సాధారణ భక్తులతో పాటుగా వీఐపీల తాకిడి పెరిగింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం, హనుమకొండలోని వేయిస్తంభాలగుడి, కీసరలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
వేములవాడ రాజన్న క్షేత్రంలో శుక్రవారం నుంచే వేడుకలు మొదలయ్యాయి. ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వామివారికి శనివారం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఆలయ నిర్వాహకులు వేడుకలకు ఏర్పాట్లు చేశారు.

వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయానికి చేరుకునేందుకు భక్తుల కోసం ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భోజనం, మంచి నీటీ సదుపాయాలు కల్పించారు. హనుమకొండలోని వేయిస్తంభాలగుడి, స్వయంభూ సిద్ధేశ్వరాలయంతోపాటు ఇతర ఆలయాల్లో శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేయిస్తంభాలగుడిలో శుక్రవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
మహాశివరాత్రి జాతర కోసం హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం వేములవాడ ఆలయ అధికారులు హెలికాప్టర్ సేవలను అందుబాటులో ఉంచారు. నేరుగా రాజన్న ఆలయ చెరువు ప్రాంతంలో దిగేందుకు ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం శివరాత్రికి ఒకరోజు ముందు నుంచే శివనామస్మరణతో మార్మోగుతున్నది.

శ్రీశైలంలో సాయంత్రం మల్లిఖార్జున స్వామికి అభిషేకం, నంది వాహనోత్సవం నిర్వహించనున్నారు.రాత్రి 10 నుంచి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 12 గంటలకు స్వామివారికి బ్రహ్మోత్సవ కల్యాణం ఉంటుంది. ఈ కళ్యాణం వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ముందుగానే శ్రీశైలం చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications